MP Raghu Rama Krishna Raju: సంక్రాంతి పండుగ అందరికీ తీపి జ్ఞాపకమైతే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు మాత్రం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. భీమవరంలో సంక్రాంతి అంతా రఘురామదే అన్నట్టు ఉండేది. ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. మనిషి లేకపోతేనేం.. మన కటౌట్ ఉంటే చాలు అనుకున్నారేమో. పండుగ పూట భీమవరం కోడి పందేల నిర్వహణ ప్రాంతంలో ఆయన కటౌట్ ప్రత్యక్షమైంది. దీంతో రాజుగారి కటౌట్ పై ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటే చర్చ అట.

2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణ రాజు.. ఆ తర్వాత సీఎం జగన్ తో విభేధించారు. సీఎం జగన్ కు కంట్లో నలుసులా తయారయ్యారు. ప్రతిరోజు వైసీపీని, సీఎంను తిట్టడమే పని అన్నట్టుగా ప్రెస్ మీట్లు, ట్వీట్లతో వైసీపీని బేజారెత్తించారు. దీంతో రఘురామ పై పలు కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఐడీ రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో తన పై దాడి చేసినట్టు రఘురామ ఆరోపించారు. దీని పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి ఏపీ వైపు అడుగు పెట్టకుండా, సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకుండా చేసింది ఏపీ ప్రభుత్వం. రఘరామ వస్తే లోపలేసెయ్యాలన్నట్టు ఆయన పై కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ, ఢిల్లీ మధ్యే రఘురామ తిరుగుతున్నారు. రఘురామ పై ఇంత చర్చ జరగడానికి కారణం భీమవరంలో ప్రత్యక్షమైన ఆయన కటౌట్. గతంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేల బరుల్లో తెగ సందడి చేసేవారు రఘురామ. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం ఏపీ వైపు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన కటౌట్ ను కోడి పందేల బరుల సమీపంలో ఏర్పాటు చేయించారు.

రఘురామ కటౌట్ తో జనంలో ఒకటే చర్చ మొదలైంది. మనిషి లేకపోయినా.. కటౌట్ తో సంబరపడిపోతున్నాడని కొందరు అంటుంటే.. ప్రభుత్వంతో పేచీ పెట్టుకోకుండా ఉంటే సంక్రాంతికి ఊరికి వచ్చేవారు కదా అని మరికొందరు అనుకుంటున్నారట. ఏది ఏమైనా రఘురామ మాత్రం ఏపీ ప్రభుత్వం పై వెనక్కి తగ్గేలా లేడు. అవకాశం దొరికితే ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతున్నారు. దీంతో ఆయన వైఖరి జగన్ ప్రభుత్వానికి మింగుడు పడటంలేదు.