
YS Viveka Case: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లు దాటుతున్న ఈ కేసు వ్యవహారం ముందుకు సాగకపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేక హత్య కేసు ఇంకా ఎంతకాలం విచారిస్తారు అంటూ సిబిఐని తాజాగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులు ఇంకా ఎంతకాలం విచారిస్తారని సిబిఐని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హత్యకు గల ప్రధాన కారణాలు ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. తాజా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసులో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఈ కేసుకు సంబంధించి పలు ఘాటు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చేయడంతో కేసు పురోగతి సాధించే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఘాటు వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతూ ఉండడంపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారనాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి అంటూ సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. సిబిఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక మొత్తం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదే అని రిపోర్టులో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ నెల 29కి వాయిదా వేసిన కోర్టు..
వివేకానంద హత్య కేసును విచారించిన సందర్భంగా పాలు కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ఈనెల 29వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.. సిబిఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేయాలని ఉద్దేశంతో సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మోడీ.. అమిత్ షాలను కలిసిన సీఎం..
గత కొద్ది రోజుల నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను సిబిఐ పలుమార్లు విచారించింది. జోరుగా విచారణ సాగుతున్న నేపథ్యంలో కేసు ఒక కొలిక్కి వస్తుందని భావించారు. ఒకానొక దశలో వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుందని భావించారు. ఈ క్రమంలో కేసు ముందుకు నడుస్తున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. ఆ తర్వాత నుంచి ఈ కేసు వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆసక్తి..
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లను కలిసిన తర్వాత విచారణ ప్రక్రియ నెమ్మదించింది అన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ కేసు విచారణపై తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ కేసు మరింత వేగంగా విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలు ఎవరనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశం కనిపిస్తుంది.