YS Jagan: వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఇటీవల రాయదుర్గం ప్రాంతంలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్నాడు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో అతడిని పరామర్శించడానికి మంగళవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ వచ్చారు. ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయన విజయవాడ సబ్ జైలు వద్దకు వెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సబ్ జైలుకు వెళ్లి వల్లభనేని వంశీని పరామర్శించారు. కేసులకు భయపడదని.. తాను అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టిన కేసులో పసలేదని.. కచ్చితంగా నిర్దోషిగా బయటకి వస్తావని వల్లభనేని వంశీకి సూచించినట్టు సమాచారం. జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడానికి రావడంతో విజయవాడ సబ్ జైలు ప్రాంతం కిటకిటలాడింది. వైసీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడంతో కోలాహాలంగా మారింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో వైసిపి కీలక నేతలు కొడాలి నాని, పేర్ని నాని అక్కడికి చేరుకున్నారు. మిగతా కీలక నాయకులు కూడా అక్కడే ఉన్నారు.
పంచ్ ల మీద పంచ్ లు
వంశీని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సబ్ జైలు ఎదుట విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు.. “కొందరు పోలీసులు టిడిపి నేతలకు సెల్యూట్ కొట్టడంతోనే తమ విధులను ముగించుకుంటున్నారు. కానీ ఆ పోలీసులు టిడిపి నేతలకు సెల్యూట్ కొట్టడం మానేయాలి. తమ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలి. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు అన్యాయం చేస్తే మేము వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని” జగన్ హెచ్చరించారు. ” చంద్రబాబు కంటే వంశీ గ్లామర్ గా ఉంటాడు. కాబట్టి చంద్రబాబు వంశీని టార్గెట్ చేశాడు. వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి.. నారా లోకేష్ కంటే గ్లామర్ గా ఉంటాడు కాబట్టి చంద్రబాబు అతనిని చూసి తట్టుకోలేకపోయాడు. కొడాలి నాని కూడా చంద్రబాబు కంటే చక్కగా ఉంటాడు. తన సామాజిక వర్గం నుంచి ఎవరైనా రాజకీయంగా ఎదుగుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేడు. కేవలం తన వాళ్ళు మాత్రమే నాయకులుగా ఎదగడాన్ని అతడు ఒప్పుకుంటాడు. తనకు చెందిన వారు మాత్రమే లీడర్లుగా ఉండాలని కోరుకుంటాడు. మిగతావారు ఎదుగుతుంటే తట్టుకోలేక ఇలాంటి కేసులు పెడుతుంటాడు. మానసికంగా వేధిస్తుంటాడు. తన సామాజిక వర్గం వారు రాజకీయంగా ఎదుగుతుంటే అడుగడుగునా పుల్లలు పెడుతుంటాడు. చంద్రబాబు నైజం అదే కాబట్టి దాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ వచ్చే సారి మేము అధికారంలోకి వస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. ఇప్పుడు టైం మీద నడుస్తుంది కాబట్టి తలవంచుకొని ఉంటున్నాం. మా టైం వచ్చిన నాడు కచ్చితంగా చూపిస్తామని” జగన్ హెచ్చరించారు. జగన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి.
చంద్రబాబు కంటే వంశీ గ్లామర్ గా ఉంటాడు కాబట్టే వంశీని టార్గెట్ చేశారు : జగన్
వంశీ ఎదుగుతున్నాడు….లోకేష్ కన్నా గ్లామర్ గా ఉంటాడు కాబట్టి చంద్రబాబు ఆయనను చూసి తట్టుకోలేకపోయాడు
కొడాలి నాని కూడా చంద్రబాబు కంటే చక్కగా ఉంటాడు
తన సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఎదుగుతే చంద్రబాబు… pic.twitter.com/qY3feySo19
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025