గడిచిన ఏడు నెలలుగా దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. యువత ద్వారానే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో వెస్ట్ ఫసిఫిక్ రీజినల్ డైరెక్టర్ తకేశి కషాయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యువతలో చాలామందిలో కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడంతో కరోనా సోకినట్లు తెలియడం లేదని అన్నారు. యువత నుంచి ఇతర వ్యాధులతో బాధ పడేవారికి, వృద్ధులకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. మరోవైపు పలు దేశాలు వ్యాక్సిన్ తయారీ సంస్థలతో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత తమకే అందజేసేలా చేసుకున్న ఒప్పందంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కొన్ని దేశాలకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ అందితే వైరస్ సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. సమర్థవంతంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే హెర్డ్ ఇమ్యూన్హిటీ అవసరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కనీసం 70 శాతం మందిలో వైరస్ ను అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అయితే వైరస్ కు అడ్డుకట్ట వేయడం కష్టం కాదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో జనరల్ సలహాదారు డాక్టర్ బ్రూస్ మాట్లాడుతూ కరోనా ముప్పు ఎదుర్కోవాలంటే యాంటీ ఫ్లూ వ్యాక్సినేషన్లను నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల కాగా ఈ సంవత్సరం చివరినాటికి మిగతా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.