Killi Krupa Rani: రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాది ఎప్పుడూ అగ్రస్థానమే. ఎంతో మంది హేమాహేమీ నాయకులను జాతికి అందించింది ఈ జిల్లానే. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కీలక పోర్టుపోలియోలు ఈ జిల్లా వారికే వరిస్తాయి. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత జిల్లాలో ఎంతో మంది నాయకులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదిగారు. కింజరాపు ఎర్రన్నాయుడు, కళా వెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు వంటి వారు తెలుగుదేశంలో రాణించారు. అటువైసీపీ ఆవిర్భావం తరువాత కూడా జిల్లా నాయకులకు ‘కీ’లక పదవులు దక్కాయి. స్పీకర్ గా తమ్మినేని సీతారాం, మంత్రులుగా ధర్మాన క్రిష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు వంటివారికి అదృష్టం దక్కింది. అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చిన వారు సైతం కీలక కొలువులు దక్కించుకున్న సందర్భాలున్నాయి. అటువంటి నేతల్లో డాక్టర్ కిల్లి కృపారాణి ఒకరు. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. 2004 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేశారు. దివంగత ఎర్రన్నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు. కానీ పట్టుదలగా నిలబడ్డారు. 2009 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అనూహ్యంగా కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నా ఏమంత యాక్టివ్ గా లేరు. అందుకు ధర్మాన ప్రసాదరావుతో ఉన్న వైరమే కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృపారాణి రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోయారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. తరువాత వైసీపీలో చేరినా.. అప్పటికే నేతలతో కిటకిటలాడిన ఆ పార్టీలో పోటీచేసే అవకాశం ఆమెకు దక్కలేదు. అయినా ఏదో ఒక నామినేట్ పోస్టు ఇస్తారని ఆశించి పనిచేశారు. కానీ ధర్మాన ప్రసాదరావు మంత్రి కావడంతో ఆమె పరిస్థితి తారుమారైంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అందుకు మంత్రి ధర్మానే కారణమని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. చివరకు ఆ మధ్యన సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో ఆమె చిన్నబోయారు. వైసీపీ నేతల ఎదుటే కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటి నుంచి పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం సాగినా.. ఆమె పట్టించుకోలేదు. కనీసం ఖండించలేదు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అంతకు మించి ఆమెకు ఏ పనీ లేదు. పార్టీ నుంచి భరోసా లేదు.
వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కానీ, టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా కానీ పోటీచేయాలని ఆమె భావిస్తున్నారు.అయితే ఇప్పటికే టెక్కలి అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఖరారు చేశారు. ఎంపీగా వెళదామంటే ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ రూపంలో గట్టి పోటీ ఉంది. విద్యాధికుడు, ఆపై ప్రముఖ వైద్యుడు కావడంతో ధర్మాన ప్రసాదరావు కూడా దానేటి శ్రీధర్ కే సిఫారసు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా కృపారాణికి పోటీచేసే చాన్స్ లేనట్టేనన్న టాక్ వినిపిస్తోంది. అటు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి నామినేట్ పోస్టులు దక్కకుండా చేయడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసే చాన్స్ ఇవ్వడం లేదని ఆమె తెగ బాధపడుతున్నారు. పార్టీ మారడానికే మొగ్గుచూపుతున్నారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే అక్కడ కూడా బెర్త్ లు ఖాళీగా లేవు. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీచేయడం గ్యారెంటీ. అయితే ఏమైనా నామినేట్ పదవుల హామీతో మాత్రం ఆమె టీడీపీలో చేరే చాన్స్ ఉంది. కానీ అచ్చెన్నాయుడు పెద్దగా ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. ఆమె వస్తే పార్టీలో విభేదాలకు చాన్స్ ఎక్కువగా ఉండడంతో ఆమె రాకను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కృపారాణి కూడా ఆచీతూచీ నిర్ణయం తీసుకోనున్నట్టు అనుచరలు చెబుతున్నారు. అటు జనసేన రూపంలో మరో ఆప్షన్ ఉంది. టీడీపీతో ఆ పార్టీ పొత్తు కుదిరితే కొన్ని కీలక స్థానాలకు పోటీచేసేందుకు బలమైన అభ్యర్థులు అవసరం. అందుకే జనసేన వైపు వెళ్లేందుకు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన కృపారాణి చాన్స్ కోసం వెయిట్ చేయడాన్ని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.