YCP MLA Biyyapu Madhusudhan Reddy: మొన్నటివరకూ వైసీపీ శ్రేణులు చిరంజీవి విషయంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేవారు. ఒక గౌరవభావంతో చూసేవారు. పవన్ తో రాజకీయ వైరం ఉన్నా మెగాస్టార్ విషయంలో మాత్రం అనుబంధం కొనసాగించేవారు. సీఎం జగనే చిరంజీవిని అన్న అని సంభోదించిన సందర్భాలున్నాయి. చిరంజీవి దంపతులకు తాడేపల్లి ప్యాలెస్ కు ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చిరు జన్మదిన వేడుకలు నిర్వహించిన పరిస్థితి ఉండేది. అయితే ఇవన్నీ పవన్ ను ఇరుకున పెట్టేందుకేనన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ చిరంజీవి విషయంలో వైసీపీ నేతల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పవన్ ఉన్నత స్థానంలో చూడాలని ఉందని.. అది ఎప్పటికైనా సాధ్యపడుతుందని చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీ నేతల్లో చిరంజీవిపై అభిప్రాయం మారింది.

ఇటీవల చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యా విడుదలైంది. బాక్సాఫీసు ఎదుట సక్సెస్ ఫుల్ గా నిలిచింది. కలెక్షన్ల పర్వం కొనసాగిస్తోంది. మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో వైసీపీ శ్రేణులు సైతం ఉండడం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం సినిమాను ఓ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. తమ అనుచరుల కోసం ప్రత్యేకంగా థియేటర్ బుక్ చేసి మరీ ఫ్రీ షో చూపిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వైసీపీ నేతల్లో వచ్చిన మార్పు మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధసూధనరెడ్డి స్థానికంగా ఒక థియేటర్ లో కుటుంబసభ్యులు, అభిమానులకు సినిమా చూపించారు. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని సినిమాలో చూపించారని.. ప్రతిఒక్కరూ చూడదగ్గ సినిమాగా కితాబిచ్చారు. థియేటర్ లో కేక్ కట్ చేసి సినిమా విజయోత్సవాన్ని జరుపుకున్నారు.

అయితే ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇది ఊహించే కాబోలు ఎమ్మెల్యే మధుసూధనరెడ్డి ముందుగానే జాగ్రత్త పడ్డారు. చిరంజీవిని చూపి పవన్ నేర్చుకోవాలని చిన్న కామెంట్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ అని.. ఆ ఉద్దేశ్యంతోనే కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి సినిమా చూసినట్టు చెప్పారు. అయితే వైసీపీ, జనసేన మధ్య వాతావరణం వేడీగా ఉండడం, చిరంజీవి సైతం జనసేనకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యిన నేపథ్యంలో ఏకంగా ఒక ఎమ్మెల్యే హంగామా చేయడాన్ని అధికార పార్టీ సీరియస్ అయినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి రోజా మెగా సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని కొనసాగిస్తూ హీట్ పెంచారు. చిరంజీవి విషయంలో మారిన వైసీపీ వైఖరిని చెప్పకనే చెబుతున్నారు. ఇటువంటి సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చర్యలు చర్చనీయాంశమయ్యాయి.