YCP Ministers- Pawan Kalyan: పాడిందే పాటరా పాచిపళ్ల దాసరి అన్నట్టుంది వైసీపీ మంత్రులు, మాజీ మంత్రుల వ్యవహార శైలి. యువశక్తి కార్యక్రమంలో పవన్ ప్రసంగించిన గంటల వ్యవధిలోనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆదేశాలన్నట్టు ఒక్కొక్కరూ మీడియా ముందుకు వచ్చి రంకెలు వేశారు. పవన్ తమపై చేసిన ఆరోపణలకు స్పందించకుండా గెలుపు, ఓటములు, ప్యాకేజీ నాయకుడంటూ పాత చింతకాయ మాదిరిగా ఏవేవో మాట్లాడారు. తమకు అలవాటైన పద్ధతినే ఎంచుకున్నారు. కానీ పవన్ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం మాత్రం చేయలేదు. మంత్రులు అంబటి, రోజా, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత.. ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ నోటికి పనిచెప్పారు. ఇక కింది స్థాయి నాయకులు, పేటీఎం బ్యాచ్ గురించి చెప్పనక్కర్లేదు. యువశక్తి కార్యక్రమం ప్రారంభించక ముందే సన్నాయి నొక్కులు ప్రారంభించారు.

పవన్ పై విమర్శలకు ముందుండే మాజీ మంత్రి పేర్ని నాని ముందుగా ముందుకొచ్చారు. పవన్ పై నిప్పులు చెరిగారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచెలో దారంపోగును కూడా తీయలేకపోయారని ఎద్దేవా చేశారు. 2009 నుంచి 2014 వరకూ పవన్ పత్తా లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో మాదిరిగా డైలాగులు, సొల్లు కబుర్లు తప్పించి ఏంచేయలేకపోయారని విమర్శించారు.పవన్ చెప్పే కబుర్లు, సొల్లు మాటలు జన సైనికులకు నచ్చుతాయేమో కానీ.. ప్రజలు హర్షించరన్నారు. అసలు పవన్ ను ప్రజలు ఆహ్వానించే ప్రసక్తే లేదని తేల్చేశారు.
మంత్రి రోజా మాట్లాడుతూ మళ్లీ గెలుపోటముల కామెంట్స్ నే రిపీట్ చేశారు. తనను డైమండ్ రాణి అని పవన్ వ్యాఖ్యానించడంపై ఫైర్ అయ్యారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. పవన్ రెండు చోట్ల పోటీచేసి ఓడిన వైనాన్ని హేళన చేశారు. రెండు చోట్ల గెలిచిన తనను.. రెండుచోట్ల ఓడిన వ్యక్తి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం ఈ తిట్లను భరిస్తున్నట్టు చెప్పారు. తనపై విమర్శలకు దిగితే గట్టిగానే కౌంటర్ ఇస్తానని హెచ్చరించారు.
అయితే అనూహ్యంగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత తెరపైకి వచ్చారు. పవన్ అభిమానులను, జనసేన కార్యకర్తలను సైకోలుగా అభివర్ణించారు. వారిని అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని చెప్పుకొచ్చారు. పవిత్రమైన వివేకానందుడి జయంతి నాడు పవన్ రెచ్చగొట్టేలా మాట్లాడడం దారుణమన్నారు. మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. యువతకు పవన్ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. అయితే గత కొద్దిరోజులుగా పార్టీపైనా, అధినేతపైనా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందించడం చర్చనీయాంశమైంది.

మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. తాను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కళ్యాణాల పవన్ వంటూ సెటైర్ వేశారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదని.. పిచ్చి కుక్కగా అభివర్ణించారు. మంత్రి రోజాను డైమండ్ రాణిగా సంభోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డైమండ్ రాణి అయితే నువ్వు చంద్రబాబు బ్రోకర్ వి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ మాట్లాడిన గంటల వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతో మంత్రులు, మాజీ మంత్రులు రియాక్టు కావడం చూస్తుంటే.. మున్ముందు పవన్ పై వ్యక్తిగత విమర్శల దాడి పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.