Minister Roja: నగరి ఎమ్మెల్యే రోజా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఫించన్ల కోత రోజాకు నిద్రలేకుండా చేస్తోంది. గెలిచింది అరకొర మెజార్టీతో.. ఉన్న ఫించన్లకు కోత పెడితే 2024లో గట్టెక్కేదెలా అని తలపట్టుకుంటోందట. జగన్ ను ఏమీ అనలేక అధికారుల పై రుసరుసలాడుతున్నారట. ఇప్పటికే అసమ్మతితో బాధపడుతున్న రోజాకు ఫించన్ల కోతతో మరో తలనొప్పి తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీ నటి రోజా గెలిచారు. సమీప ప్రత్యర్థి గాలి భానుప్రకాశ్ పై ఆమె విజయం సాధించారు. జగన్ గాలిలో అత్తెసరు మెజార్టీతో రోజా నెట్టుకొచ్చారు. 2019లో ఆమెకు వచ్చిన మెజార్టీ 2,708 ఓట్లు. విజయతీరాలకు చేరేందుకు రోజా ఆపసోపాలు పడ్డట్టు మెజార్టీ చూస్తే అర్థమవుతుంది. రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో రోజాకు జగన్ అవకాశం ఇచ్చారు. మంత్రి అయితేనేం ఏం ఉపయోగం లేదు అంటూ వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారట.
అధికార పార్టీ పై ఎంతో కొంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు వైసీపీలోనే అసమ్మతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది.
గోరుచుట్ట పై రోకలి పోటులా ఫించన్ల కోత అదనపు సమస్యగా మారింది. దీంతో రోజా ఎటూ పాలుపోని సందిగ్ధ పరిస్థితిలో ఉందట. ఒకవైపు అసమ్మతిని తగ్గించుకోవాలి. మరోవైపు ప్రభుత్వం పై వ్యతిరేకతను తగ్గించాలి. ఈ సమస్యలకు తోడు ఫించన్ల కోత పెట్టడంతో జనం వైసీపీ నేతల వెంటపడుతున్నారట. దీంతో రోజాకు తల ప్రాణం తోకకు వచ్చిందట.

అధికారులకు ఫోన్ చేస్తే పై వారి ఆదేశాలు తూ.చ తప్పక పాటించాలని చెబుతున్నారట. మంత్రి మాట కూడ ఖాతరు చేయలేదని చిత్తూరు జనం మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకత తగ్గించడానికి కొత్త ఫించన్లు ఇవ్వాలి కానీ ఉన్న ఫించనల్లు తీయడమేంటని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇలాగైతే 2024 ఎన్నికలు గట్టెక్కెడం అంత సులువు కాదని పెదవి విరుస్తున్నారు.