Batagaika : : భూమికి మరో ఉపద్రవం : వేగంగా విస్తరిస్తున్న అతిపెద్ద బిలం.. ఇది దేనికి సంకేతం.. ఎవరికి ప్రమాదం?

భూమి వేడెక్కడం వల్ల ఈ గొయ్యి కరుగుతోందనీ.. అందువల్ల నానాటికీ ఇది మరింతగా లోతుకి వెళ్లిపోతోందని వారు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : July 23, 2023 2:40 pm
Follow us on

Batagaika : ప్రపంచంలోనే అతి పెద్దదైన శాశ్వత బిలం నానాటికి విస్తరిస్తోంది. రష్యాలోని సైబీరియాలో ఉన్న ‘బటగైకా’ మంచు బిలం వేగంగా పెరగడం అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక భూతాపం కారణంగా ఈ బిలం చుట్టూ కింది భాగంలో ఉన్న మంచు కరిగిపోయి భూ ఉపరితలం కుంగిపోతోంది. దీంతో ఈ మంచు బిలం విస్తరిస్తోంది. బిలంపై దొంతరులుగా కనిపిస్తున్న ఉపరితలాలు నేల కోతకు గురికావడం ఏర్పడతాయి. మంచు బిలం పెరిగిపోవడంతో చుట్టూ ఉన్న పట్టణాలు, రోడ్లు బీటలు వారుతున్నాయి. భూగర్భంలో ఉన్న పైపులైన్లు దెబ్బతింటున్నాయి.

1960లో గుర్తింపు..
1960లో ఈ మంచు బిలాన్ని కనుగొన్నారు. లోతు 282 అడుగులు. ఇది పాతాళానికి వెళ్లేందుకు ఒక మార్గమని స్థానికుల నమ్మకం. రష్యాలోని సఖా రిపబ్లిక్‌ ప్రజలు దీనిని ‘అండర్‌ వరల్డ్‌ గేట్‌వే’అని కూడా పిలుస్తారు. బటగైకాకు ‘మౌత్‌ టు హెల్‌’ అనే మారు పేరుతోపాటు ‘మెగా స్లంప్‌’ అనే శాస్త్రీయ నామం కూడా ఉంది. ఈ ప్రాంతంలో విచక్షణారహితంగా అడవులను నరికివేయడంతో మంచు కరిగిపోయింది. ఈకారణంగా నేల కోతకు గురవుతోంది. బిలం విస్తరించడం ప్రమాదానికి సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నగరాలపై ప్రభావం..
ఈ బిలం విస్తరణ కారణంగా రష్యాలోని ఉత్తర, ఈశాన్య నగరాలు ఇప్పటికే ప్రభావితం అయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు బిలం పెరిగేందుకు మరింత ఊతమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మేము దీన్ని కేవ్‌ ఇన్‌ అని కూడా పిలుస్తాం. ముందుగా ఇది లోయగా కనిపించింది. ఆ తర్వాత వేసవిలో భూమి కుంగిపోయి బిలం పెద్దగా మారడాన్ని గమనించాం’ అని స్థానికుడు ఎరెల్‌ స్ట్రుచ్‌కోవ్‌ తెలిపారు. ‘భవిష్యత్తులో దీని పరిమాణం మరింత విస్తరిస్తుంది. ఎంత వేగంగా జరుగుతుందన్నది కచ్చితంగా తెలియదు. కానీ.. ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే రష్యా 2.5 రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఇది బిలం పెరిగేందుకు కారణమౌతోంది’ అని శాస్త్రవేత్త నిఖితా తననాయేవ్‌ తెలిపారు.

కొనసాగుతున్న పరిశోధనలు..
ఈ గొయ్యి దగ్గరకు ఇద్దరు పరిశోధకులు వెళ్లారు. గొయ్యి ఎలా పెరుగుతోందో వివరించారు. వాళ్లు డ్రోన్‌ కెమెరాతో విజువల్స్‌ తీశారు. అందుకు సంబంధించిన వీడియోని రాయిటర్స్‌ ట్వీట్‌ చేసింది. భూమి వేడెక్కడం వల్ల ఈ గొయ్యి కరుగుతోందనీ.. అందువల్ల నానాటికీ ఇది మరింతగా లోతుకి వెళ్లిపోతోందని వారు తెలిపారు.