World Water Day: పీల్చేగాలి తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది నీరు. నీరు లేకుంటే మనిషి మనుగడ దాదాపు అసాధ్యం. మన ఒంట్లో 90 శాతం వరకు నీరే ఉంటుంది. ఆ నీరే వివిధ జీవ క్రియలకు తోడ్పడుతుంది. ఆ నీరే లేకుంటే మనిషే కాదు, ఇతర జంతువులు కూడా ఈ భూమ్మీద బతకలేవు. అక్కడిదాకా ఎందుకు ఈ భూమి మీద హరప్పా, మొహంజాదారో గొప్ప సంస్కృతులుగా విలసిల్లడానికి ప్రధాన కారణం నీరే. నదుల చుట్టే ఆ నగరాలు వెలిశాయి. వందల ఏళ్ల తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుత నవీన యుగంలోనూ ప్రపంచంలోని పెద్ద పెద్ద నగరాలు మొత్తం నీటి వనరుల చుట్టే నిర్మితమయ్యాయి. అందుకే జలమే జగతికి బలం అంటారు.. ఆ జలాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నిర్వహిస్తారు. బ్రెజిల్ రాజధానిలో 1992లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అభివృద్ధి సదస్సు జరిగింది. ఆ సందర్భంగా ఎజెండా -21 కింద ప్రపంచ జల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. 1992 డిసెంబర్లో ఒక తీర్మానాన్ని ఆమోదించగా.. మార్చి 22 నుంచి ప్రపంచ జల దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు.
మనదేశంలో ఐటీ సిటీగా పేరుపొందిన బెంగళూరులో ఈ ఏడాది తీవ్రమైన తాగునీటి సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో జల పరిరక్షణ అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడం, భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు కానరాకపోవడం, ఉన్న భూగర్భ జలాలను విపరీతంగా వాడటం వల్ల బెంగళూరు నరకం చూస్తోంది. అంతకుముందు అంటే 2016లో మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతం తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో అక్కడి ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం ఏకంగా ప్రత్యేక రైళ్లల్లో, బందోబస్తు మధ్య తాగునీటిని పంపించింది. లాతూర్ సంక్షోభాలు చోటు చేసుకోకుండా ఉండాలని అప్పట్లో ప్రతిజ్ఞలు చేశారు. నీటి సంరక్షణను చేపట్టాలని నినాదాలు చేశారు. కానీ అవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. కేవలం 8 సంవత్సరాల లోనే బెంగళూరు రూపంలో మరో నీటి సంక్షోభం కళ్ళ ముందు కనిపిస్తోంది. కనీసం తాగేందుకు నీరు లభించకపోవడంతో బెంగళూరు వాసులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనూ బోరు ఎండిపోయిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్నానం వారానికి ఒకసారి మాత్రమే చేస్తున్నామని.. నీటి కోసం గంటలకొద్దీ ఎదురుచూస్తున్నామని బెంగళూరు నగర వాసులు చెబుతున్నారు.
వాస్తవానికి బెంగళూరు నగరం లో భూగర్భ జలాలు మెండుగా ఉండేవి. ఆ నగరంలో ఈ స్థాయిలో తాగునీటి సంక్షోభం గతంలో ఎప్పుడూ రాలేదు. వరుస కరువు, కాటకాలు ఏర్పడినప్పటికీ తాగునీటి కోసం జనం ఈ స్థాయిలో ఇబ్బంది పడలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరు నగరంలో చెరువులు, నీటి కుంటలు కబ్జాకు గురయ్యాయి. దీంతో వాటి నిల్వనీటి సామర్థ్యం తగ్గిపోయింది. మరోవైపు భూగర్భ జలాలను పరిరక్షించే చర్యలను ప్రభుత్వాలు, ప్రజలు పట్టించుకోలేదు. ఫలితంగా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడం మొదలైంది. దానికి వర్షాభావ పరిస్థితులు తోడు కావడంతో తాగునీటి సంక్షోభం మొదలైంది. ఆర్వో ప్లాంట్ వద్ద ఒక్కొక్కరికి ఒక్కో క్యాన్ మాత్రమే నీరు ఇస్తున్నారంటే బెంగళూరులో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఏంటి ప్రత్యేకత
ప్రతి సంవత్సరం జల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఒక థీమ్ నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ఈ ఏడాది water for prosperity and peace అంటే సమృద్ధి, శాంతి కోసం నీరు.. అనే థీమ్ తో నీటి వనరులను కాపాడాలని పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది థీమ్ మారినప్పటికీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు వంటి లక్ష్యాల ఆధారంగానే థీమ్ పరిభ్రమిస్తూ ఉంటుంది.
భవిష్యత్తు అంధకారమే
కొన్ని సంస్థల నివేదికల ప్రకారం మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు అందని ద్రాక్ష గానే ఉంది. కలుషితనీటినే ప్రజలు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ నీరు దొరకడం కూడా గగనమవుతోంది. గుజరాత్ లోని ఏడారి ప్రాంతాలు, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో తాగునీటికి నేటికీ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక నగరాలలో తాగునీటి వనరులు కబ్జాకు గురవుతున్నాయి. చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. దీనివల్ల నిల్వ నీటి సామర్థ్యం తగ్గిపోయి నీటి కరువు ఏర్పడుతోంది. కేవలం తాగునీరు మాత్రమే కాదు.. సాగునీటికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాజెక్టులలో పూడిక పెరిగిపోవడం.. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవడం.. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వంటివి వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జలాన్ని ఎంతగా సంరక్షిస్తే మనిషి జీవితం అంత సాఫీగా ఉంటుంది. లేకుంటే గుక్కెడు నీటి కోసం కోసుల దూరం వెళ్లాల్సి వస్తుంది. కళ్ళముందే లాతూర్ విలువైన పాఠాలు చెప్పింది. బెంగళూరు కన్నీటి కష్టాలను కళ్ళ ముందు ఉంచుతోంది. ఇప్పటికైనా మేల్కోవాలి. గొంతు తడిపే జలాన్ని ఒడిసి పట్టాలి.