IPL 2024: జట్టు గురించి ఆలోచించడంలో ధోని తర్వాతే ఎవరైనా. వ్యక్తిగత రికార్డులు కాకుండా.. జట్టు కోసం మాత్రమే పరితపించే ఆటగాడు అతడు. అందుకే అతడి నాయకత్వంలో చెన్నై జట్టు ఐదు ట్రోఫీలు దక్కించుకుంది. రవీంద్ర జడేజా ఒక సీజన్లో కెప్టెన్ గా ఉన్నప్పుడు చెన్నై జట్టు దారుణమైన ప్రదర్శనను కనబరిచింది. కానీ ఆ తర్వాత ఏడాదికే చెన్నై జట్టు విజేతగా ఆవిర్భవించింది. అంటే దీనిని బట్టి ధోని నాయకత్వ పటిమ ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గురువారం చెన్నై కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత.. చెన్నై జట్టు కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను ధోని నియమించాడు. దానికి చెన్నై యాజమాన్యం కూడా ఒప్పుకుంది. నిజంగా మహేంద్ర సింగ్ ధోనీని ఆ స్థాయిలో రుతురాజ్ ఎలా ఆకట్టుకున్నాడు? అతనిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? వాటిని చూసే ధోని సారధ్య బాధ్యత అప్పగించాడా? అంటే దీనికి అవుననే సమాధానాలు చెబుతున్నారు విశ్లేషకులు.
రుతురాజ్ గైక్వాడ్ వయసు 27 సంవత్సరాలు. పైగా అతడు దేశవాళి క్రికెట్లో గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. పైగా గైక్వాడ్ కు క్రమశిక్షణ చాలా ఎక్కువ. క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అని చెబుతుంటారు. అలాంటి ఆటలో గైక్వాడ్ హుందాగా వ్యవహరిస్తుంటాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుతుంటాడు. గైక్వాడ్ ప్రతి సందర్భంలోనూ నింపాదిగా ఉంటాడు. అది ధోని కి బాగా నచ్చిందని చెబుతున్నారు. ఆటగాళ్లపై అరవడం, అనవసరమైన షో చేయకపోవడం, నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచించడం.. వంటి లక్షణాలు రుతురాజ్ లో ఉండటంతో ధోని కెప్టెన్ గా చేసేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
బ్యాటింగ్ విషయంలోనూ గైక్వాడ్ అనవసర ఒత్తిడికి గురికాడు. తోటి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడు. పైగా టైమింగ్ విషయంలో కచ్చితంగా ఉంటాడు. అతడి ఫుట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్ట్రైట్ షాట్లు ఆడటంలో అతడు దిట్ట. చాలాసార్లు చెన్నై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో గైక్వాడ్ గెలిపించాడు. ముఖ్యంగా అందర్నీ కలుపుకోవడంలో రుతురాజ్ ముందుంటాడు. జట్టులో సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాడు. గేమ్ అవేర్నెస్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాడు. ఒక కెప్టెన్ కు అది కచ్చితంగా ఉండాలి. ఈ లక్షణాలు మొత్తం గైక్వాడ్ లో ఉండటం.. పైగా అతడిలో తనను తాను చూసుకోవడంతో.. చెన్నై జట్టు భావి కెప్టెన్ గా గైక్వాడ్ ను ధోని ప్రకటించాడని తెలుస్తోంది. మరి ఈ సీజన్లో గైక్వాడ్ ధోని మెచ్చేలా సారధ్య బాధ్యతలు వహిస్తాడా? అంతకుమించి అనే స్థాయిలో వ్యవహరిస్తాడా? అనేవి త్వరలోనే తేలుతాయి.
View this post on Instagram