Happy New Year 2023: పండుగల నిర్వహణ ఒక్కో దేశంలో ఒకలా నిర్వహిస్తారు. మన దేశంలో పండుగలకు కొదవే లేదు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని కొన్ని దేశాల్లో వారి అభిరుచికి అనుగుణంగా చేసుకుంటారు. వింతైన ఆచారాలు, వినూత్న పంథాలు ఎవరికి నచ్చిన విధంగా వారు జరుపుకోవడం ఆనవాయితీ. ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉండటం మామూలే. కొత్త సంవత్సర వేళ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా వేడుకలు నిర్వహించుకుంటారు. వాటిని గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు.

నూతన సంవత్సరం సందర్భంగా డెన్మార్క్ లో ఓ గమ్మత్తైన ఆచారం ఉంది. అక్కడ ఇళ్ల ముందు పగిలిన ప్లేట్లు దర్శనమిస్తాయి. ఇళ్ల ముందు ప్లేట్లు పగులగొడితే రాబోయే సంవత్సరం మంచి జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం. డెన్మార్క్ ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువుల ఇంటికి వెళ్లి ప్లేట్లను పగులగొట్టి వారి తలుపు దగ్గర విసిరేస్తుంటారు. ఇలా చేస్తే శుభాకాంక్షలు చెప్పినట్లు భావిస్తుంటారు. ఇలా వారి ఆచారం ప్రకారం వారు ఇలా చేయడం సహజమే.
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్, ఆస్ర్టేలియాలోని సిడ్నీ లాంటి నగరాల్లో క్రేకర్స్ వెలుగులు కనిపిస్తాయి కెనడాలోని టొరంటో, బ్రెజిల్ లోని రియోలో కూడా బాణాసంచా కాల్చి వెలుగులు చూడటం శుభ సంకేతంగా భావిస్తారు. బ్రెజిల్ లో కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి అక్కడి ప్రజలు పప్పును శుభ చిహ్నంగా చేసుకుంటారు. పప్పు తినడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని అక్కడి వారి విశ్వాసం. స్పెయిన్ లో ఓ వింతైన ఆచారం ఉంది. అక్కడి ప్రజలు అర్థరాత్రి పూట ద్రాక్ష పండ్లు తింటే రాబోయే 12 నెలలు అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం.

ఆసియాలోని చాలా దేశాల్లో కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి జపాన్, దక్షిణ కొరియాల్లో గంటలు మోగిస్తారు. జపాన్ లో 108 సార్లు గంట మోగిస్తే శుభంగా భావిస్తారు. రుమేనియాలో కూడా ఓ వింతైన ఆచారం ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు వారు ఎలుగుబంటి దుస్తులు ధరించి డ్యాన్సులు చేయడం అలవాటు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని నమ్ముతుంటారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో వస్తువులను విసిరేస్తూ పండుగ జరుపుకుంటారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్స్ బర్గ్ లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు గృహోపకరణాలను విసిరేస్తారు. ఇది మన భోగిలా ఉంటుంది. అక్కడ వారు కిటికీలోంచి వస్తువులను విసిరేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శుభాలు కలుగుతాయని వారి విశ్వాసం. దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో చాలా మంది సూట్ కేసులతో తిరుగుతారు. ఇలా చేస్తే శుభం కలుగుతుందని వారి నమ్మకం.