Abhimanyu Easwaran Stadium: అంటిగ్వా లో వివ్ రిచర్డ్స్ పేరుతో క్రికెట్ స్టేడియం ఉంది. టవురాబా లో బ్రియాన్ లారా పేరుతో స్టేడియం ఉంది. బ్రిస్బేన్ లో అలన్ బోర్డర్ పేరుతో పెద్ద స్టేడియం ఉంది. వీరంతా కూడా క్రికెట్ లో దిగ్గజాలు. వారి ఆట తీరుకు గుర్తుగా, భావి తరాలు తెలుసుకునే విధంగా ఆ మైదానాలకు వాళ్ల పేర్లు పెట్టారు. మనదేశంలో 27 సంవత్సరాల యువకుడి పేరు మీద ఒక స్టేడియం ఉంది. అలాగని ఆ యువకుడు అంతర్జాతీయ మ్యాచుల్లో భారీగా ఆడింది లేదు.. గొప్ప గొప్ప స్కోర్లు సాధించింది లేదు. కానీ అతడు ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. తన పేరిట నిర్మించిన స్టేడియంలో రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు.. అది కూడా అతని కన్న తండ్రి ముందు.

ఇలా మొదలైంది
కన్నతల్లి ప్రేమ కళ్ళముందు కనిపిస్తుంది. తండ్రి ప్రేమ గుండెల్లో నిలిచి ఉంటుంది. కానీ ఈ తండ్రి కొడుకు పై తన ప్రేమను, ఆటపై తన ఇష్టాన్ని క్రికెట్ స్టేడియం అంత పెద్దగా వ్యక్తపరచాడు.. అదే ఇప్పుడు ఆయనను వార్తల్లో వ్యక్తిని చేసింది. తమిళనాడుకు చెందిన రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ కు క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం. కానీ కుటుంబ నేపథ్యం అందుకు సహకరించకపోవడంతో ఆయన తన ఆటను తనలోనే పెట్టుకున్నాడు. క్రికెటర్ కావాలనే ఆశను తుంచేసుకున్నాడు. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ అమ్మి వచ్చిన డబ్బులను ఇంట్లో ఇచ్చేవాడు.. ఈ ఉదాహరణ చాలు అతడి కుటుంబ నేపథ్యం ఏమిటో తెలుస్తుంది.
క్రికెట్ పై ఎంత ప్రేమ ఉందో.. చదువుపై కూడా అంత ధ్యాస ఉండేది.. అదే అతడిని చార్టెడ్ అకౌంటెంట్ ను చేసింది.. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ తన మనసులో ఉన్న క్రికెటర్ ను ఎన్నడూ చంపుకోలేదు.. ఇదే క్రమంలో పెళ్లయింది.. కొడుకు పుట్టాడు.. అతని పేరు అభిమన్యు అని పెట్టుకున్నాడు.. ఏ ముహూర్తానయితే అతడికి ఆ పేరు పెట్టుకొని తెలియదు కానీ… మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడి మాదిరి రూపాంతరం చెందాడు.
కొడుకు కోసం
తాను క్రికెటర్ కాలేకపోయినప్పటికీ… అది తన కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని రంగనాథన్ అనుకున్నాడు.. తాను వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ కావడంతో… వచ్చిన డబ్బుతో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో భూమి కొనుగోలు చేశాడు.. అది కూడా 1988లో. అప్పుడే దానికి అభిమన్యు క్రికెట్ అకాడమీ అని పేరు పెట్టాడు.. అప్పటికి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు.. దాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు.. 1995లో అభిమన్యు పుట్టిన తర్వాత రంగనాథన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నప్పటినుంచి డెహ్రాడున్ లో తాను అభివృద్ధి చేసిన మైదానంలో కొడుకును ఆడించేవాడు.. దీంతో అభిమన్యు దినదిన ప్రవర్దమానంగా ఎదిగాడు. రంజి మ్యాచుల్లో 19 సెంచరీలు సాధించాడు.. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ క్రీడా సమాఖ్య ఎంపిక చేసింది.. ఆరోజున రంగనాథన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తండ్రి నిర్మించిన స్టేడియంలో..
రంగనాథన్ నిర్మించిన స్టేడియాన్ని భారత క్రికెట్ క్రీడా సమాఖ్య లీజుకు తీసుకుంది.. అందులో దేశవాళీ మ్యాచులు ఆడిస్తున్నది. ఇక మంగళవారం రంజీ ట్రోఫీ – బీ కేటగిరిలో బెంగాల్ జట్టుతో ఉత్తరాఖాండ్ ఆడుతున్నది.. లో అభిమన్యు కూడా ఆడుతున్నాడు. తన కళ్ళ ముందు తాను నిర్మించిన స్టేడియంలో తన కొడుకు ఆడుతుండడంతో రంగనాథన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం తనకు ఇష్టమైన ఆట కోసం ఉత్తరా ఖాండ్ దాకా వచ్చి ఒక స్టేడియం నిర్మించి… ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తెచ్చిన రంగనాథన్ అభినందనీయుడు. చిరస్మరణీయుడు కూడా..
ఇక ఈ స్టేడియంలో 60 గదులు, 20 హాస్టల్ గదులు ఉన్నాయి.. వర్షాకాలంలో ఫ్లడ్ లైట్ ఇండోర్ ప్రాక్టీస్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది..స్టాఫ్ కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ నిర్మించారు.. ఆటగాళ్ల కోసం ప్రపంచ శ్రేణి బేకరీ కూడా ఇక్కడ ఉంది. ఇక ఇక్కడి మైదానం ద్వారా ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు..వారిలో సీమర్ దీపక్ దఫోలా ఒకడు.. ఇతడు ఇటీవల రంజీ మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, శ్రేహాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ వంటి వారు ఈ మైదానంలో ప్రాక్టీస్ చేశారు.. అవుట్ ఫీల్డ్ బాగుందని కితాబు ఇచ్చారు.