Women Alcohol : మద్యం ఆరోగ్యానికి మంచిదా, చెడా అని ఆలోచించేవారు తగ్గిపోయారు. చెడు అని వైద్యులు చెబుతున్నా.. వివిధ కారణాలు చూపుతూ మద్యం తాగుతున్నారు. దీంతో ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. అంతే తాగేవారు పెరుగుతున్నారు. మద్యం ధరలను ప్రభుత్వాలు పెంచుతున్నా తాగుడు మాత్రం మానడం లేదు. కరోనా(Corona) సమయంలోనే మద్యం దొరకక అల్లాడిపోయారు. ఇప్పుడు దేశమంతా మద్యం ఏరులై పారుతోంది. బిహార్(Bihar)లో మాత్రం మద్య నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వాలకు మద్యం అమ్మకాలు ఆదాయ వనరుగా మారాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు చేకూరుస్తున్నాయి. దీంతో మద్య నిషేధానికి ప్రభుత్వాలు సాహసం చేయడం లేదు. ఇదిలా ఉంటే.. మారుతున్న సంస్కృతి, పాశ్చాత్య పోకడలతో మహిళలు కూడా ఇప్పుడ మద్యానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా యువత ఒత్తిడి దూరం కావడానికి మత్తును ఆశ్రయిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇండియా(India)లో మద్యం తాగే మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అసోం (Asom). కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా 15–49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటున 1.2 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అసోంలో ఈ శాతం 16.5కి సమీపంలో ఉంది. ఈ గణాంకాలు అసోంను ఈ విషయంలో ముందంజలో ఉంచుతున్నాయి. అస్సాం తర్వాత మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మద్యం తాగే మహిళల సంఖ్య గణనీయంగా ఉంది.
Also Read : వాంతులు వచ్చినా సరే తాగుతున్నారా? అయితే ఇది మీకోసమే..
కారణాలు ఇవీ..
అసోం వంటి రాష్ట్రాల్లో మహిళలు మద్యం సేవించడానికి గల కారణాలు విభిన్నంగా ఉంటాయి. ఇవి సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి.
సాంస్కృతిక సంప్రదాయాలు: అసోం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన సంఘాలలో మద్యం తాగడం సాంప్రదాయ భాగంగా ఉంది. ఉదాహరణకు, ఇంట్లో తయారు చేసిన రైస్ బీర్ (Rice Beer) లేదా ‘అపాంగ్‘ వంటి స్థానిక సారాయి సామాజిక కార్యక్రమాలు, పండుగలు, వేడుకల్లో సాధారణంగా వినియోగించబడుతుంది. మహిళలు కూడా ఈ సంప్రదాయాల్లో భాగంగా మద్యం సేవిస్తారు.
సామాజిక ఒత్తిడి, జీవనశైలి: ఈశాన్య రాష్ట్రాల్లో సామాజిక స్వేచ్ఛ, లింగ సమానత్వం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మహిళలు పురుషులతో సమానంగా మద్యం తాగడాన్ని సాధారణంగా స్వీకరిస్తారు.
ఆర్థిక కారణాలు: అసోంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం మహిళలు స్థానిక సారాయి తయారీలో పాల్గొంటారు. ఈ ప్రక్రియలో వారు తమ ఉత్పత్తులను పరీక్షించడం లేదా వినియోగించడం కూడా జరుగుతుంది.
ఒత్తిడి నివారణ: కొందరు మహిళలు రోజువారీ జీవనంలో ఒత్తిడి, కష్టాల నుండి ఉపశమనం పొందడానికి మద్యం వైపు మొగ్గు చూపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
స్థానిక లభ్యత: అసోంలో స్థానికంగా తయారయ్యే మద్యం చౌకగా, సులభంగా లభ్యం కావడం వల్ల దాని వినియోగం మహిళల్లోనూ పెరిగింది.
ఈ కారణాలు అసోంతోపాటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి.
Also Read : మద్యంతో క్యాన్సర్ ముప్పు.. WHO ఏం చెబుతుందంటే?