CM Jagan: ఇప్పటివరకూ ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు. ఏపీ సీఎం జగన్ కు అసలు సిసలైన అగ్నిపరీక్ష ఎదురుకానుంది. గత ఎన్నికల్లో ఎన్ని అంశాలు అడ్వాంటేజ్ గా నిలిచాయో.. ఇప్పుడు అవన్నీ ప్రతికూలంగా మారనున్నాయి. ఇప్పటికే సవాల్ చేస్తున్నాయి. విపక్షాల మధ్య ఐక్యత, ప్రభుత్వంపై కొన్నివర్గాల వ్యతిరేకత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటివి కలవరపెడుతున్నాయి. మరోవైపు పార్టీలో పెల్లుబికుతున్న అసమ్మతి, ధిక్కార స్వరాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమిస్తేనే జగన్ పైచేయి సాధించేది. అయితే వీటిని దాటి వెళ్లాలంటే ఓర్పు, నేర్పు, సంయమనం చాలాకీలకం. అందర్ని కలుపుకెళ్లడమే ఉత్తమం. కానీ జగన్ నైజం ఇప్పటివరకూ డేరింగ్, డేషింగ్ గానే సాగింది. ఉన్నపళంగా వీటిని అలవరచుకోవాలంటే సాధ్యమేనా? అన్న ప్రశ్న సొంత పార్టీలో ఉత్పన్నమవుతోంది. పరిస్థితులకు తగ్గట్టుగా జగన్ మారకుంటే మాత్రం మూల్యం తప్పదని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

పుట్టిన నాటి నుంచే జగన్ రాజకీయాల మధ్య పెరిగారు. తండ్రి ఎమ్మెల్యేగా, విపక్ష నేతగా, సీఎంగా పనిచేయడంతో రాజకీయ సకల భోగాలు, కష్ట, నష్టాలను గుర్తెరిగారు. అయితే రాజకీయంగా కష్టాలు ప్రారంభమైనది మాత్రం తండ్రి మరణం తరువాతే. గంటల కాదు.. రోజు కాదు.. నెలలతరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అందుకే తన మనసును కఠినంగా చేసుకున్నారు. ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి సవాల్ చేశారు. ఆ పార్టీ పునాదులనే కదిపారు. ముందుగా ప్రతిపక్ష స్థానాన్ని చేజిక్కించుకున్నారు. తరువాత అధికార పీఠాన్ని అందిపుచ్చుకున్నారు. తండ్రి ఉన్నంత వరకూ ఆయన చాటున.. తండ్రి మరణం తరువాత కష్టాలు, కేసులను అధిగమించి రాజకీయంగా పట్టుసాధించారు.
గత ఎన్నికల్లో ఒక్క చాన్స్ అన్న మాట పనిచేసింది. బాగావర్కవుట్ అయ్యింది. సీనియర్లు సైతం జగన్ ప్రభంజనం పై ఆధారపడాల్సి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభంజనం కాస్తా నీరసించిపోయింది. ఒక్కచాన్స్ అన్న మాటకు కాలం చెల్లిపోయింది. కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు.. అదీ లోయర్ క్లాస్ లోనే కాస్తా ప్రభుత్వానికి సానుకూలత కనిపిస్తోంది. సమాజం, రాజకీయాలు,సమకాలిన అంశాల పట్ల అవగాహన ఉన్న వారు ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఎగువ మధ్యతరగతి, ఉద్యోగ, ఉపాధ్యాయులు అయితే పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారారు. వీరి వ్యతిరేకతను చల్లార్చడంతో పాటు కొత్తగా వారి అభిమానం చూరగొనడం అనేది కష్టమే. ఉన్నది ఏడాది కాలం కావడంతో సంక్షేమ పథకాలు రెట్టింపు చేసినా ఈ మూడు వర్గాలను తన దారిలోకి తెచ్చుకోవడ్ జగన్ కు కత్తిమీద సామే.

ఇన్నాళ్లూ జగన్ లేనిదే తమ రాజకీయ జీవితం లేదని భావించిన సీనియర్లు ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైన నేపథ్యంలో పునరాలోచనలో పడ్డారు. ధిక్కార స్వరం పెంచారు. మరికొందరు తమ రాజకీయ వారసులను తెరపైకితెచ్చి అవకాశాలు ఇవ్వమని కోరుతున్నారు. అయితే ఇక్కడే జగన్ తన సహజ శైలిని బయటపెట్టి వారిని దూరం చేసుకుంటున్నారు. చేస్తే గీస్తే మీరు చేయండి.. వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. వారిని కూర్చొని మాట్లాడకుండా తన పాతవాసనలతో అల్టిమేట్ ఇస్తున్నారు. దీంతో సీనియర్లు కూడా తమ ప్రత్యామ్నాయ అవకాశాల వేటలో పడ్డారు. ఇలా ఆలోచన చేస్తూ జగన్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. అదే చంద్రబాబు అయితే సీనియర్లను కూర్చోబెట్టి వారి చెప్పినది విని.. కన్వెన్స్ చేసి చివరకి తన మాటనే అమలుచేసుకుంటారు. అది జగన్ లో మచ్చుకైనా లేకపోవడం మైనస్సే.
వైసీపీలో ఉన్న కాపు నాయకులకు జగనే అధినేత. కానీ ఇప్పుడు వారి మనసులో ఉన్నది పవన్ మాత్రమే. తమ నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్దేశించేది ఇప్పుడు జగన్ కాదన్నమాట. వారి దృష్టిలో పవనే ఇప్పుడు ఉన్నారు. కాపు సామాజికవర్గంలో ప్రభావం చూపే స్టేజ్ కి పవన్ చేరుకోవడంతో ఇప్పుడు వైసీపీ కాపు నేతలకు తత్వం బోధపడింది. అందుకే వారు పవన్ వైపు క్యూకడుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ పిలిచి టిక్కెట్ ఇచ్చి గెలిపించారన్న సానుభూతి ఉన్నవారు వెనక్కి తగ్గుతున్న వారు ఉన్నారు. కానీ మెజార్టీ కాపు ఎమ్మెల్యేలు జనసేనకు టచ్ లోకి వెళ్లిపోయారు. వారిని నియంత్రించడం జగన్ కు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో మాదిరిగా ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని కూడా అనేందుకు జగన్ సాహసించడం లేదు. అటు ఇంటా, ఇటు బయటా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్న జగన్ అసలు నిలబడగలారా? అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది.