
Raja Singh: రాజాసింగ్.. తెలంగాణలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. ఆయన ఏదీ మాట్లాడినా సంచలనమే. కరుడుగట్టిన హిందూవాది అయిన రాజాసింగ్ హిందూ ధర్మ ప్రచారంలో అగ్రభాగాన ఉంటారు. వివాదస్పద అంశాలపై తరుచూగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రవాదుల నుంచి థ్రెటన్ ఉందని తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఆయనకు ఓ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కూడా కేటాయించింది. కానీ ఇప్పుడు అదే వాహనం రాజాసింగ్‌కు ముప్పుగా మారింది.
మీకు కొత్తవి.. మాకు డొక్కువా..?
తెలంగాణ ప్రభుత్వం మంత్రులకు కొత్త కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తూ.. తనకు మాత్రం డొక్కు వాహనాలు కేటాయించిందని రాజాసింగ్ ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శించారు. తనకు కేటాయించిన వాహనం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం డోర్ వేసిన తర్వాత తీస్తే లాక్ పడుతోందని, లాక్ తీసినా డోర్ ఓపెన్ కాదంటూ గతంలో వ్యాఖ్యానించారు.
వాహనం మార్చాలని వినతి..
తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనికిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీకి గత నవంబర్‌లో లేఖ కూడా రాశారు. ‘నాకు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకొచ్చినా.. తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారు. 2010 మోడల్‌కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్గం మధ్యలోనే నిలిచిపోతోంది.. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు. ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. తనకు తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ వివరించారు. దీని వల్ల ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు తనపై దాడి చేసేలా అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. తనకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోండి. పాత వాహనాన్ని వినియోగించలేను అని వివరించారు. తరచూ అగిపోతున్న వాహనాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపితే రిజేర్ చేసి ఇచ్చారని తెలిపారు.
సోషల్ మీడియాలో వీడియో..
ఇటీవల అఫ్జల్ గంజ్ మీదుగా రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తుండగా.. మధ్యలో మొరాయించింది. దీంతో అసహనానికి గురైన ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడంతో అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నానని తెలిపారు. దీనిపై రాజాసింగ్ అభిమానులు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.

ఊడిపోయిన టైరు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గురువారం త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా ధూల్‌పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజాసింగ్ సురక్షితంగా బయటపడ్డారు.
కావాలనే డొక్కు వాహనం ఇస్తున్నారా..
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై రాజా సింగ్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వాహనం చాలా పాతది కావడంతో, దాన్ని మార్చాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కావాలనే తన భద్రతను గాలికొదిలేసిందని రాజాసింగ్ విమర్శించారు. ప్రభుత్వం తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇంటలిజెన్స్ అధికారులకు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వాహనం మార్చకపోవడంపై కావాలనే చేస్తున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.