Heavy Rains: మాడు పగలగొట్టే మే నెలలో వర్షాలు కురిశాయి. నిండుగా వానలు కురవాల్సిన జూలై మొదటి వారంలో మే నెల మాదిరి ఎండలు కాశాయి. ఇప్పుడేమో ఊరు_ వాడను ముంచెత్తే లాగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి కారణం ప్రకృతి విపత్తులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అకాల వర్షాల వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు అవి నేరుగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా చేతికి వచ్చిన పంటలు మొత్తం నీటి పాలవుతున్నాయి. ఇలా పంటలు మొత్తం నీటిపాలు కావడం వల్ల అది కేవలం రైతుల మీదనే కాకుండా సమస్త జనావళి ఆహార భద్రత మీద ప్రభావం చూపిస్తోంది. మూడు సంవత్సరాలుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 10 లక్షల ఎకరాల్లో పంట పొలాలు నీటిపాలయ్యాయి. చేతికి వచ్చిన పంట మొత్తం పనికి రాకుండా పోయింది.
గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణం లో కనివిని ఎరుగనిస్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మండు ఎండలు, అంతలోనే ఆవరిస్తున్న మేఘాలు.. ఆ తర్వాత మిన్ను మన్ను ఏకం చేసేలాగా వర్షాలు.. ఇలాంటి పరిస్థితులు నిత్య కృత్యమయ్యాయి.. అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల వరదలు పోటెత్తుతుండడంతో మృత్తికా క్రమక్షయం వాటిల్లుతోంది. దీనివల్ల భూమిమీద సారవంతమైన పొర కొట్టుకుపోయి పంటల సాగుకు పనికిరాకుండా పోతున్నది. నానాటికి పెరిగిపోతున్న భూతాపం వల్లే ఇలాంటి వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 27 అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పెరుగుతున్న భూతాపం వల్ల ధ్రువపు ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. దీంతోపాటు విపరీతమైన వర్షాలు కురుస్తుండడం వల్ల అంటు వ్యాధులు, ఇతర ప్రతికూలతలు నమోదవుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం నేరుగా వ్యవసాయం మీద పడుతుండడం వల్ల దాని అనుబంధంగా ఉన్న రంగాలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.. ఇది కేవలం వ్యవసారంగాన్ని మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తున్నది.
గత ఏడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాల వల్ల హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో గోధుమ దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల అక్కడి రైతులు గోధుమలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు పంట పెట్టుబడి మొత్తం నీటిలో కలిసిపోవడంతో రైతులు నిండా ముని గారు. ఈ ఏడాది రబీ సీజన్లో విస్తారమైన వర్షాలు కురవడంతో తెలంగాణ రాష్ట్రంలో చేతికి వచ్చిన మొక్కజొన్న, వరి నీటిపాలైంది. సుమారు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న పంట తుడిచిపెట్టుకుపోయింది. ఇక వరి అయితే నామరూపాలు లేకుండా పోయింది. వాస్తవానికి ఇటువంటి ప్రకృతి విపత్తులను నివారించాలి అంటే పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడం ఒకటే మార్గం. భూతాపం తగ్గాలంటే పరిశ్రమలు కాలుష్యకారక పదార్థాల విడుదలను తగ్గించాలి. విషవాయువులను సాధ్యమైనంతవరకు శుద్ధిచేసి గాలిలోకి వదలాలి. అభివృద్ధి పేరుతో విస్తారంగా చెట్లను నరికి వేయడం మానుకోవాలి. చెరువులను, నీటి కుంటల్లోకి కాలుష్య ఉద్గారాలను విడుదల చేయడం తగ్గించాలి.. అప్పుడే భూతాపం తగ్గుతుంది. అకాల వర్షాలు, వాతావరణంలో ప్రతికూలతలు తగ్గుముఖం పడతాయి. లేనిపక్షంలో సమస్త మానవాళి ఇబ్బంది పడక తప్పదు.