KCR- Amaravati: ప్రజల అంతరంగాన్ని గ్రహించి రాజకీయ పార్టీలు, నేతలు నిర్ణయాలు తీసుకోవాలి. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. అందునా కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించే పార్టీలు మరీజాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ మనోభావాలను తెలియజెప్పే ప్రయత్నంలో కేసీఆర్ వాడిన భాష, యాస సొంత రాష్ట్ర ప్రజలకు రుచించాయి. అందుకే వారు పట్టం కట్టారు. రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రాంతీయ వాదం నుంచి జాతీయ వాదంపై మనసు పారేసుకున్న కేసీఆర్ కొన్ని కఠిన నిర్ణయాలు అమలుచేయక తప్పని పరిస్థితి. దయాది రాష్ట్రం ఏపీలో పార్టీని విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ఇష్యూపై క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఆయనపై ఏర్పడింది. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందాలని.. ప్రపంచంలో మంచి నగరాల్లో ఒకటిగా నిలవాలని ఆకాంక్షించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ తీసుకున్న మూడు రాజధానులకు మద్దతుగా కేసీఆర్ అండ్ కో మద్దతు తెలిపిన సంకేతాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ పనిమీద ఉన్న కేసీఆర్ అమరావతి రాజధానిపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అమరావతా? లేకుంటే మూడు రాజధానులా? ఇప్పుడు కేసీఆర్ ముందున్న టాస్క్ ఇదే. ఇప్పటికే ఒక్క వైసీపీ మినహాయించి అన్ని రాజకీయ పక్షాలు అమరావతికే మద్దతు తెలిపాయి. చివరకు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం అమరావతికే స్ట్రాంగ్ మద్దతు పలికింది. ఈ పరిస్థితుల్లో మెజార్టీ రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే విమర్శలపాలయ్యే అవకాశముంది. అటు మూడు రాజధానులకు ప్రజా మద్దతు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పుడు కానీ అమరావతికి కాకుండా మూడు రాజధానులకు మద్దతు ప్రకటిస్తే విపక్షాలకు చాన్సిచ్చినట్టవుతుంది. పైగా జగన్ కేసీఆర్ ఒక్కటేనన్న సంకేతం వెళుతుంది. అదే జరిగితే ఏపీ పార్టీ విస్తరణ మరింత జఠిలంగా మారుతుంది. అందుకే కేసీఆర్ అమరావతికే జై కొట్టేందుకు డిసైడయినట్టు తెలుస్తోంది.

తాజాగా అమరావతి రాజధానిపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పందించారు. అమరావతి రాజధానినే సమర్థిస్తామని చెప్పుకొచ్చారు. రాజధాని అనేది రాజకీయ పార్టీల కోసం కాదని.. ప్రజల కోసమేనని.. అందుకే గతంలో నిర్ణయించిన రాజధానికే మద్దతు తెలుపుతామని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కూడా ప్రజాభిప్రాయానికి తగిన విధంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టుంది. నిజానికి భారత్ రాష్ట్ర సమితికి రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొంది. కేసీఆర్ అమరావతి రాజధాని శంకుస్థాపనకు రావడం, అటు కేటీఆర్ జగన్ మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడడంతో ఎలా ముందుకెళ్లాలో పాలుపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తోట చంద్రశేఖర్ కాస్తా క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. అయితే కేసీఆర్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. చంద్రశేఖర్ ప్రకటించినట్టు అమరావతికి జై కొడితే ఏ సమస్యా ఉండదు. మరి నలుగురికి నచ్చింది నాకెందుకు నచ్చాలి? అని మూడు రాజధానులకు మద్దతు ఇస్తే మాత్రం సీన్ రివార్స్ అయ్యే చాన్స్ ఉంది. అయితే ఏపీలో అటువంటి ప్రయోగాలు చేస్తామంటే కేసీఆర్ కు కుదిరే పనికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి రాజధానికి తలవంచక తప్పదని చెబుతున్నారు.