
Jagan- YCP MLAs: బైపాస్ సర్జరీ చేయించుకున్న గుండె జగన్ అని కొట్టుకుంటుంది. జగన్ బొమ్మ లేకపోతే నాలాంటి వాడికి అడ్రస్ లేకుండా పోయేది. జగన్ అనేవాడు లేకుంటే నా అనేవాడు ఉండేవాడు కాదు. నేను చనిపోతే జగన్ తప్పకుండా రావాలి. ఇవేవో స్లోగన్స్ కాదండీ.. ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు మొన్నటివరకూ వినిపించిన అంతులేని ప్రేమ వ్యాఖ్యలు. అయితే వీరు ప్రేమతో చేసిన వ్యాఖ్యలే అయినా.. తాము ఆశించింది ఆయన్నుంచి దక్కకపోయేసరికి.. అటు నుంచి అంత వ్యామోహం లేదని తెలిసేటప్పటికి..ఆరాధాన నుంచి అసంతృప్తి.. అక్కడ నుంచి ధిక్కారం వైపు వెళ్లిపోయారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు…జగన్ పై ఎమ్మెల్యేల కోపానికి ఎన్నెన్నో కారణాలు పెరిగిపోయాయి. అధినేత నుంచి, పార్టీ నుంచి దూరం చేసేందుకు ప్రోత్సహించాయి. ఎంతో ఆశించి రాజకీయాల్లోకి వస్తే ఏవీ అందకుండా పోయాయన్న బాధతో ఒక్కొక్కరూ దూరమవుతున్నారు.
పవరూ లేదు.. నిధులు లేవు…
సాధారణంగా పవర్ కోసం.. నాలుగు రాళ్లు వెనుకేసుకొచ్చేందుకు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తారు. అవే దక్కకపోతే ఈ రాజకీయాలు ఎందుకని నిట్టూరుస్తారు. వైపీపీలో కూడా జరిగింది అదే. ఎమ్మెల్యేలైతే అయ్యాం కానీ.. పవర్ లేదు.. నిధులు లేవన్నట్టు పరిస్థితి దాపురించింది. సీఎం జగన్ బటన్ నొక్కుడు.. కింద వలంటీర్లు పంచుడు అన్నచందంగా మారిందే కానీ.. ఎమ్మెల్యేలకు, చివరకు మంత్రులకు కూడా పని లేకుండా పోయింది. నేను పంచుతున్నాను..మీరు ప్రచారం చేయండి.. ప్రజల మధ్య ఉండండి అంటూ జగన్ పురమాయిస్తున్నారు. ఇచ్చింది జగన్.. అందించింది వలంటీర్లు అయితే మీ బోడి పెత్తనం ఏంది అని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏమైనా అభివృద్ధి చేసుంటే చెప్పండి అంటూ ప్రజలు అడుగుతున్నారే తప్ప.. ప్రభుత్వ పథకాల్లో ఎమ్మెల్యేలకు ప్రజలు భాగస్వామ్యం కల్పించలేదు. ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి ఇదో ప్రధాన కారణం.
ఆ లెక్కల గణాంకాలతో…
అంతా నవరత్నాలే..అందులోనే లెక్క కట్టి కేటాయింపులు చేసినట్టు గణాంకాలు. అంతకు మించి అభివృద్ధి లేదు. మా నియోజకవర్గంలో రహదారులు బాగాలేదు. ప్రత్యేక ప్రాజెక్టలేవీ లేవంటే చూద్దాం.. చేద్దాం అంటూ సర్దుబాట్లు. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. పోనీ సీఎం ను కలుద్దామంటూ సలహదారుల అడ్డుగోడలు. వారికి చెప్పి.. సహేతుకమైన కారణాలు చూపితే కానీ కలవనివ్వరు. పైగా నీడలో వెంటాడే ఐప్యాక్ టీమ్. ప్రజల నుంచి గెలిచిన తమ అభిప్రాయానికి కాదని.. వంద మంది ఉండే ఐ ప్యాక్ బృందం ప్రతినిధుల మాటకే విలువ ఎక్కువ. వారిచ్చే నివేదికలకే ప్రాధాన్యత ఎక్కువ. గడపగడపకూ తిరగలేదని.. ప్రజల మధ్య ఉండడం లేదన్న ఆక్షేపణలు. పైగా తప్పిస్తానన్న బెదిరింపులు. ఇటువంటి కారణాలన్నీ జగన్ పై ఎమ్మెల్యేలకు కోపం పెంచాయి. అగాధాన్ని సృష్టించాయి.

ప్రత్యామ్నాయ నాయకత్వంతో చెక్.,.
వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే ఎదగకుండా చేశారు. తన సొంత చిరిష్మతో గెలిచేందుకు చాన్స్ ఇవ్వలేదు. నువ్వు కాకుంటే మరొకరు అంటూ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని రెడీ చేసి ఉంచారు. ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేయాలి తప్ప.. పార్టీ అనేది ఎమ్మెల్యేల కోసం కాదన్నది జగన్ రాజకీయం. ఇలా అతిగా వ్యవహరించి చాలామంది ఎమ్మెల్యేలను దూరం చేసుకున్నారు. మరికొందరిలో అసంతృప్తికి కారణమయ్యారు. ప్రస్తుతానికి ఆనం, కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావొచ్చు. మున్ముందు ఈ సంఖ్య పదులు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితికి కర్త, కర్మ, క్రియ సీఎం జగనే తప్ప మరొకరు కారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.