Tomato Prices Increase: దేశవ్యాప్తంగా టమాటా ధర మండిపోతుంది.. ఏకంగా సెంచరీ మార్క్ దాటేసింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాలలో వందకు మించి పలుకుతోంది. దీంతో టమాటా కొనుగోలు చేయాలంటే వినియోగదారులు భయ పడుతున్నారు. హోటల్స్ కూడా టమాటా తో తయారుచేసే వంటకాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాయి. ప్రత్యామ్నాయ వంటకాలను దానికి బదులుగా చేర్చాయి. టమాటా ధర ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాయితీపై వినియోగదారులకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది.
ప్రస్తుతం వర్షాలు అంతంతమాత్రంగా కురుస్తుండడంతో టమాట ఉత్పత్తి తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, మదనపల్లి, ఉరవకొండ, గుత్తి తదితర మార్కెట్లలో టమాటా విపరీతంగా వస్తుంది. ఈ ప్రాంతాల్లో రైతులు హైడ్రోపోనిక్స్ విధానంలో టమాటాను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట మార్కెట్ కు వస్తోంది. ధర సెంచరీ మార్క్ దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతు బజార్లలో కిలో 50 రూపాయలకే అందుబాటులో ఉంచేలాగా చర్యలు చేపట్టింది. కడప, కర్నూలు జిల్లాలలో బుధవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోజుకు 60 టన్నుల టమాటా సేకరించాలని నిర్దేశించుకుంది. మరోవైపు టమాటో తో పాటు ఆకాశాన్ని అంటుతున్న పచ్చిమిర్చిని కూడా రాయితీ మీద వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో టమాటా ధర అమాంతం పెరిగింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల తమిళనాడు రాష్ట్రంలో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో నిన్న మొన్నటి వరకు 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాట ధర ఇప్పుడు ఏకంగా 100 దాటింది. మిగతా నిత్యావసరాలు కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జనాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, రైతు బజార్ల సీఈవో నందకిషోర్ తో పాటు పలువురు జిల్లా అధికారులు టమాట ధరలపై సమీక్ష నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పచ్చిమిర్చిని కూడా రాయితీపై అందజేసేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఇక ధరలు ఎగబాకిననేపథ్యంలో మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో టమాటాను ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా అధికారులు కట్టడి చేపట్టారు. అంతేకాదు రైతుల నుంచి కిలో 70 చొప్పున సేకరించారు. వీటిని వినియోగదారులకు కిలోకు 50 చొప్పున విక్రయిస్తారు. ఇక ధరలు అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రభుత్వం ఇలా రాయితీ మీద టమాటాలు విక్రయిస్తామని చెబుతోంది. రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలలో వీటిని వినియోగదారులకు విక్రయించేందుకు ఏర్పాటు చేసింది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు కిలోలు మాత్రమే అమ్ముతోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why are tomato prices increasing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com