Chilzo: మన ఇంట్లో పంచభక్ష్య పరమాన్నాలు వండుకున్నప్పటికీ.. పొరుగు ఇంట్లో వండిన పుల్లకూర మహా రుచిగా ఉంటుంది. ఇక దీనిని దేశానికి అన్వయిస్తే మన ప్రాంతంలో ఎన్నో వైవిధ్యమైన వంటకాలు ఉన్నప్పటికీ ఇతర దేశాల వంటకాలనే బాగా ఇష్టపడతాం. గ్లోబలైజేషన్ వల్ల కొత్త కొత్త సంస్కృతులు పరిచయమవుతున్న వేళ.. వారి తిండి కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సరిగ్గా రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో చైనీస్ నూడుల్స్ అప్పుడే పరిచయమయ్యాయి.. కానీ నేడు అవి మన ఆహారంలో ఒక మెనూ అయిపోయాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర దేశాల ఆహార పదార్థాలు కూడా మన జిహ్వ మీద దాడి చేశాయి. యూట్యూబ్ పుణ్యమా అని కొత్త కొత్త ఫుడ్ వ్లాగర్లు పుట్టుకొస్తున్నారు.. సరికొత్త విదేశీ రుచులను పరిచయం చేస్తున్నారు.. ఎన్ని విదేశీ వంటకాలు ఉన్నప్పటికీ మన ఇంట్లో ఉండే వంటకు సరిరాదు.. అయినప్పటికీ పొరుగింటి పుల్లకూర మీద మనవాళ్లకు యావ ఎక్కువ. సరిగ్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముంబై నగరానికి చెందిన హేమ ఆమె పిల్లలు దియా, ఓజస్వి సరికొత్త ఆహార ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
సాధారణంగా చైనా వంటకాలు తినాలి అనిపిస్తే మనం ఆ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటలీ వంటకాలతో మన కడుపు నింపుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంతానికే రెక్కలు కట్టుకొని ఎగరాల్సిన పనిలేదు. ముంబైలోని “చిల్జో” లోకి అడుగుపెడితే చాలు ఎన్నో దేశాలకు సంబంధించిన నోరు ఊరించే వంటకాలు రారమ్మని స్వాగతం పలుకుతాయి.. గత ఏడాది హేమ తన కూతుర్లు దియా, ఓజస్వి తో కలిసి ఒక ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించింది.. ముగ్గురికి కూడా పాకశాస్త్రంలో విశేషమైన ప్రావీణ్యం ఉండడంతో అనతి కాలంలోనే వారి రెస్టారెంట్ సూపర్ హిట్ అయింది. కేవలం ముంబై నగరానికి చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వారి రెస్టారెంట్ కి వెళ్ళేవారు.. అక్కడ వారు చేసిన కొత్త కొత్త రుచులను లొట్టలు వేసుకుంటూ ఆరగించేవారు..”ఆహారానికి క్వాలిటీ మాత్రమే ముఖ్యం.. ఆ క్వాలిటీ మేము అందించాం. ఫలితంగా వినియోగదారులు మా రెస్టారెంట్ ను ఆదరించారు” అని చెబుతోంది దియా. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో ఆమె పని చేసింది. ఉద్యోగ కాలంలో ఆమెకు ఎన్నో ప్రాంతాలతో పరిచయం ఏర్పడింది. ఆ ప్రాంతాలలో విభిన్నమైన రుచులను ఆస్వాదించే అవకాశం ఆమెకు దక్కింది.. అయితే ఆ ఆహార పదార్థాలను కేవలం తినడంతోనే సరిపెట్టకుండా వాటి తయారీ విధానాన్ని అక్కడి చెఫ్ లను అడిగి తెలుసుకునేది. ఆ వంటల వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకునేది..
కరోనా వల్ల స్వదేశానికి తిరిగి వచ్చిన దియా ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించింది..లాక్ డౌన్ కాలంలో బయటికి వెళ్లి తినే పరిస్థితి లేదు. ఇంట్లో దాల్, రోటీ తప్ప మరో మార్గం లేదు. మరోవైపు రకరకాల వంటకాలు గుర్తుకు వచ్చి ఆమె నోరు ఊరేది. ఆ సమయంలో తాను రాసుకున్న విదేశీ వంటకాల తయారీ విధానాన్ని ఒకసారి పరిశీలించింది.. అయితే ఆ వంటల మీద ఆమె తల్లి, సోదరితో కలిసి ప్రయోగాలు మొదలు పెట్టింది. అయితే మొదట్లో వారు ఆ తయారీ విధానంలో విఫలమయ్యారు. చేస్తూ చేస్తూ విజయవంతమయ్యారు. వారు ప్రొఫెషనల్ చెఫ్ కాకపోయినప్పటికీ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ వంటల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఇక వంటల్లో ప్రయోగాల్లో భాగంగా వారు తయారు చేసిన రెండు వందల సాస్ లను స్నేహితులకు పంపిణీ చేశారు. వారి నుంచి మంచి స్పందన రావడంతో ఆ తల్లి కూతుర్ల మధ్యలో “చిల్జో” ఆలోచన వచ్చింది. ఒక ఏడాది పాటు అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తమ పొదుపు మొత్తాల నుంచి 40 లక్షల రూపాయలు తీసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. హోటల్ అంటే మనుషుల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 30 మందిని నియమించుకున్నారు. ఇక ఆ యూనిట్ మొదలైన తర్వాత దియా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యోగం ఒక్కసారిగా మానివేయడంతో ఆమె ఇబ్బందికి గురైనప్పటికీ, సొంత వ్యాపారం మొదలుపెట్టాం అనే ధీమా ఆమెకు కొత్త ఉత్సాహం ఇచ్చింది.. మార్కెట్ లో ఎలాంటి నైపుణ్యాలు తెలియనప్పటికీ వారు విజయవంతమయ్యారు. అనతి కాలంలోనే వందలాదిమంది వినియోగదారులను సంపాదించుకున్నారు. వినియోగదారుడే దేవుడు అనే సూక్తిని అమల్లో పెట్టారు. అంతే కాదు దేశ వాణిజ్య నగరమైన ముంబైలో విదేశీ రుచులను సమర్థవంతంగా అందించడంతో వినియోగదారుల మన్ననలు పొందారు. అంతేకాదు ఎటువంటి నేపథ్యం లేకపోయినప్పటికీ రిస్క్ తీసుకొని మరీ తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకున్నారు.