Homeజాతీయ వార్తలుKCR- Visakha Steel Plant: ఏపీలో ఓకే.. తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితేంటి?

KCR- Visakha Steel Plant: ఏపీలో ఓకే.. తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితేంటి?

KCR- Visakha Steel Plant
KCR- Visakha Steel Plant

KCR- Visakha Steel Plant: అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న చందంగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరు. ఇప్పటికే కుటుంబ పాలన, లిక్కర్‌ స్కాం, ప్రశవ్నపత్రాల లీకేజీ, అవినీతి, నిరుద్యోగంతో తెలంగాణలో కేసీఆర్‌ పాలనపై వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో సొంత రాష్ట్రంలో పాలనను, ప్రజలు, ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నారు. ఒకవైపు మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న గులాబీ బాస్‌.. అక్కడ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు తొలి అడుగు అని ప్రచారం జరుగుతున్న ఓ బిడ్‌ లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇందుకు సింగరేణిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు.

రాజకీయం కోసమే..
వాస్తవంగా చెప్పాలంటే.. బిడ్‌ పొందాలనే ఆలోచన తెలంగాణ సర్కార్‌కు లేదు. కేవలం బిడ్‌లో పాల్గొంటే.. కేంద్రంపై తాను పోరాటం చేస్తున్నానని చెప్పడంతోపాటు.. ఏపీలోకి తమ ఎంట్రీ సాఫీగా సాగుతుందని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. అయితే ఇలా పాల్గొనడం వలన సొంత రాష్ట్రంలో అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం ఊహించలేకపోతున్నారు.

ఆ పరిశ్రమల మాటేమిటంటున్న విపక్షాలు..
పొరుగు రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతానని బయల్దేరాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌కు విపక్షాలు అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో మూతపడ్డ పరిశ్రమలను తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్‌ఎంటీ, హెచ్‌సీఎల్, ఐడీపీఎల్‌ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క పరిశ్రమను కూడా తెరిపించలేదు. ఇక బయ్యారం ఉక్కు కోసం ‘కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్‌ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా’అని ప్రకటించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. దీంతో విపక్షాలు హామీ ఇచ్చిన పరిశ్రమలు ఎప్పుడు తెరిపిస్తారని ప్రశ్నిస్తున్నాయి.

తెలంగాణ సొమ్ము పణంగా పెట్టి..
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బిడ్‌ వేయాలని కేసీఆర్‌ అనుకోవడం కచ్చితంగా రాజకీయ వ్యూహమే. అందులో సందేహం లేదు. కేంద్ర సంస్థల్ని.. మోదీ సర్కార్‌ ప్రైవేటు పరం చేస్తోందని.. వాటిని తాము కాపాడతామని కేసీఆర్‌ నిరూపించాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆయన పణంగా పెడుతోంది తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ బిడ్‌ వస్తుందా రాదా అన్న సంగతి పక్కన పెడితే.. వస్తే మాత్రం కచ్చితంగా వదిలించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడి వరకూ వెళ్లకపోయినా ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరిగే చర్చ వేరు. తెలంగాణలో ఎన్నో ఉండగా.. చివరికి మాటిచ్చినవే ఎన్నో ఉండగా.. ఎక్కడో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఎందుకు కేసీఆర్‌ కంగారు పడుతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

KCR- Visakha Steel Plant
KCR- Visakha Steel Plant

తెలంగాణ ప్రజల్లోనూ ఇటీవల కేసీఆర్‌ రాజకీయంపై చర్చ జరుగుతోంది. ప్రగతి భవన్‌లో ఇతర రాష్ట్రాల వారికి విందులు ఇస్తున్నారు కానీ తెలంగాణ సామాన్య ప్రజలకు ఎంట్రీ ఉండదు. పైగా తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆయన దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలనుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తేడా జరిగితే.. దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని రాజకీయ లబ్ది కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version