
Pawan Kalyan: రాబోవు ఎన్నికల్లో మ్యాజిక్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా రాజకీయంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించనున్నారో 14వ తేదీన జరగబోయే ఆవిర్భావ సభ వేదిక కానుందని తెలుస్తుంది.
జనసేన పార్టీని ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చేరువ చేసేందుకు పవన్ కల్యాణ్ పరితపిస్తున్నారు. ఆయన సభలకు పెట్టే పేర్ల దగ్గర నుంచి చేపట్టబోయే కార్యక్రమాలకు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే వంటి వారి పేర్లను ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల11వ తేదీన బీసీ సంక్షేమంపై మంగళగిరిలో రాష్ట్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. అణగారిన వర్గాల ఆకాంక్షల మేరకు జనసేన కార్యక్రమాలు ఉంటాయనే సూచనలను ప్రజలకు తెలియజేస్తున్నారు.
కాగా, ఇటీవల అధికార వైసీపీ బీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఎమ్మెల్సీల్లో 14 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు కేటాయించి రాజకీయం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంటూ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు టీడీపీ బీసీలు తమతోనే అంటూ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో పవన్ ఏ మేరకు బీసీ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకుంటారనేది ప్రాధాన్యత సంతరించుకుంది.

నియోజకవర్గాల వారీగా పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసగా నేతలతో భేటీ అవుతున్నారు. టీడీపీతో పొత్తుపై ఆయన వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా లేదా రాజకీయ తప్పిదమా అనేది ఇంకా తేలలేదు. మచిలీ పట్నం సభలో దీనిపై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
ఏదైమైనా జనసేన గ్రాఫ్ పెంచేందుకు చేయాల్సిన పనులన్నింటిని పవన్ కల్యాణ్ చేస్తున్నారు. వారాహితో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు 14వ తేదీన జరగబోయే ఆవిర్బావ సభ వేదికగా నిలపబోతున్నట్లు తెలుస్తుంది.