Homeక్రీడలుSuryakumar Yadav: వన్డేల్లో సూర్యకుమార్ ఫ్లాప్ వెనుక కారణమేంటి?

Suryakumar Yadav: వన్డేల్లో సూర్యకుమార్ ఫ్లాప్ వెనుక కారణమేంటి?

Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య కుమార్‌ యాదవ్‌.. హెలిక్యాప్టర్ షాట్స్ తో తక్కువ కాలంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా క్రికెటర్. అయితే వన్డేల్లో అతని ఆట తీరు చూసినవారు… టీ20ల్లో అడుతున్న సూర్య, ఈ సూర్య ఒక్కరేనా అని సందేహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ అరవీర భయంకరంగా కనిపించే సూర్య.. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు.

టీ20ల్లో ఆడటం చాలా కష్టం..
పొట్టి క్రికెట్‌ టీ 20లో క్రికెటర్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట అదరగొడుతున్న సూర్య కుమార్‌ యాదవ్‌.. ఒత్తిడి తక్కువ ఉండే వన్డేల్లోకి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. మెరుపుల సంగతి పక్కన పెడితే.. కనీసం పరుగులు రావడం లేదు. దీంతో సూర్య నీ ప్రతాపం అక్కడేనా అన్న చర్చ మొదలైంది.

ఎందుకు తీసుకున్నారు అనేలా?
సూర్య కుమార్‌ యాదవ్‌.. టీ20ల్లో అదరగొడుతుంటే.. ‘ఇన్నాళ్లూ ఈ మెరికలాంటి ప్లేయర్‌ను వన్డే జట్టులో ఎందుకు జట్టులోకి తీసుకోలేదు’ అనే ప్రశ్న వినిపించింది. ఆ తర్వాత ‘ఇప్పటికే ఆలస్యమైంది వన్డేలు, టెస్టుల్లోకి వెంటనే తీసుకోండి’ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు సూర్య వన్డే జట్టులో ఎందుకు తీసుకున్నారు అనేలా ఉంది ఆయన ఆట తీరు. వన్డే మ్యాచ్ లకు సూర్య సరిపోడా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

టీ20ల్లో నంబర్ వన్‌...
సూర్య కుమార్‌ యాదవ్‌ టీ20ల్లో ఓ తుపానులా వచ్చాడు. సూపర్‌ ఫాస్ట్‌ గేమ్‌గా పేరొందిన టీ20ల్లో అతని వేగం అద్భుతం. అందుకే ఐసీసీ ర్యాంకింగ్స్‌ టాప్‌ స్థానానికి వెళ్లిపోయాడు. బౌలర్‌ ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా మైదానంలో విరుచుకుపడుతుంటాడు. ఈ క్రమంలో అన్నివైపులా షాట్లు కొట్టి 360 డిగ్రీల బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు కూడా. ఇప్పటివరకు టీ20ల్లో సూర్య 48 మ్యాచ్‌ల్లో 1675 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 176 స్ట్రైక్‌ రేటు ఆయన సొంతం.

ఫార్మాట్‌కి అడ్జస్ట్‌ అవ్వడం లేదా?
టీ20ల్లో సూర్య బ్యాటింగ్‌ చూసి వావ్‌ అనుకున్న ఫ్యాన్స్‌, క్రీడా పండితులు అర్జెంట్‌గా వన్డేల్లోకి, టెస్టుల్లోకి తీసుకొచ్చేయండి అన్నారు. అనుకున్నట్లుగా సూర్య వన్డేల్లోకి వచ్చాడు. అయితే టీ20 జోరు మాత్రం తీసుకురాలేకపోయాడు. ఆఖరికి ఆ ఫామ్‌ను కూడా కొనసాగించలేకపోయాడు. ఇప్పటివరకు 22 వన్డేలు ఆడిన సూర్య 433 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. టీ20లతో పోలిస్తే ఈ స్కోరు ఏ మూలకూ సరిపోదు. ఆఖరి పది ఇన్నింగ్స్‌లు చూసుకుంటే 0, 0, 14, 31, 4, 6, 34, 4, 8, 9 పరుగులు చేశాడు. ఆఖరిగా అర్ధశతకం కొట్టి… సంవత్సరం దాటిపోయింది.

అంచనాలు ఎక్కువ?
బౌలర్ల అంచనాలకు అందని సూర్య ఇప్పుడు అవే అంచనాలతో ఇబ్బందిపడుతున్నాడేమో అనిపిస్తోంది. పొట్టి క్రికెట్‌లో అదరగొట్టాను కదా.. ఇక్కడ ఏమాత్రం తగ్గకూడదు అని అనుకుంటున్నాడో ఏమో… వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. గత 16 ఇన్నింగ్స్‌ల్లో అర్ధ సెంచరీ లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అందులో ఒక్కసారి మాత్రమే 34 నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అంచనాలను అందుకునే క్రమంలో ఒత్తిడితో చిత్తవుతున్నాడా అనే అనుమానం కూడా వస్తోంది. టీ20లు, వన్డేలు ఒకటి కావు అనే విషయం అతడు గుర్తెరిగితే త్వరగా ట్రాక్‌లోకి వస్తాడు.

Suryakumar Yadav
Suryakumar Yadav

ప్రత్యర్థులు డీకోడ్‌ చేసేశారా?
టీ20ల్లో సూర్య సూపర్‌ ఫామ్‌ను చూసి.. ప్రత్యర్థి జట్లు ముందుగా వన్డేల కోసం ప్లాన్స్‌ సిద్ధం చేసుకున్నాయా అనే సందేహం కూడా ఉంది. ఆస్ట్రేలియా సిరీసే తీసుకుంటే సూర్యకు వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ వేసి ఎల్‌బీడబ్ల్యూ చేశాడు స్టార్క్‌. క్రీజులోకి వచ్చిన వెంటనే సూర్య వికెట్ల ముందు, ఫోర్త్‌ స్టంప్‌ లైన్‌లో కాస్త ఇబ్బందిగా ఉంటాడు అనే విమర్శ ఉంది. దీనినే స్టార్క్‌ క్యాష్‌ చేసుకున్నాడు అనొచ్చు. వికెట్‌ టు వికెట్‌ వేస్తే.. అయితే కీపర్‌కి, లేదంటే స్లిప్‌లో, ఇంకా లేదంటే ఎల్‌బీడబ్ల్యూ అవుతాడని ప్లాన్‌ చేసి ఔట్‌ చేస్తున్నారు అనిపిస్తోంది. ఈ ప్లానింగ్‌ టీ20ల్లో బౌలర్లు వేస్తే అక్కడ కూడా సూర్యకు కష్టమే అని చెప్పొచ్చు.

ఇంకా బ్యాక్‌ చేస్తారా?
సూర్య లాంటి స్టార్‌ ఆటగాడిని రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోబెట్టాలని ఏ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అనుకోదు. అయితే ఎన్నాళ్లు ఇలా ఛాన్స్‌లు ఇస్తారు అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే జట్టులో ఇప్పుడు ప్రతీ స్థానం కోసం పోటీ గట్టగా ఉంది. ఈ సమయంలో ఇంకెన్ని మ్యాచ్‌లకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూర్యను బ్యాకప్‌ చేస్తుంది అనేది చూడాలి. ‘ఇక చాలు’ అని అనుకుంటే.. సూర్య మెరుపులు టీ20లకే పరిమితం అవుతాయి.

విమర్శలు కొత్త కాదు..
అయితే ఇలాంటి విమర్శలు సూర్యకు కొత్త కాదు. పరిస్థితులను ఎదుర్కొని నిలవడం సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో చేసి చూపించాడు కూడా. కాబట్టే లేటు వయసులో కుర్ర క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. వన్స్‌ స్వింగ్‌లోకి వస్తే వన్డేలు, టెస్టుల్లో రాణించడం అతనికి పెద్ద విషయం కాదు. కావాల్సిందల్లా.. సరైన ఇన్నింగ్స్‌. అది చెన్నైలో జరిగే మూడో వన్డే అవ్వాలని ఆశిద్దాం.!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular