
Sunrisers Hyderabad: ఐపీఎల్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇష్టమైన క్రికెట్ పండుగ. సీజన్ 16 ఇటీవలే ప్రారంభమైంది. అయితే జట్ల పేర్లు, ప్రాంతీయత ఆధారంగా కొన్ని జట్లను కొంతమంది ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును తెలుగు క్రికెట్ అభిమానులు తమ జట్టుగా భావిస్తున్నారు. అయితే ఈ జట్టు గత 15 సీజన్లలో ఒకే ఒక్కసారి టోర్నీ గెలుచుకుంది. మిగత 14 సార్లు పేలవ ప్రదర్శనకే పరిమితమౌతోంది. జట్టు ఓడిపోయిన ప్రతీసారి తెలుగు క్రికెట్ అభిమానుల గుండె కలుక్కుమంటోంది. ఉత్సాహం నీరుగారుతోంది. 16వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో 71 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్.. రెండో గేమ్‌లో లక్నో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఆరంభంలోనే పరాభవం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఆరాభంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్ష్య చేతనలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్స్ తడబడ్డారు. తక్కువ స్కోర్‌కే చేతులు ఎత్తేశారు. దీంతో ఈ సీజన్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్ ప్రయాణం ఓటమితోనే మొదలైంది. దానికి కొనసాగింపుగా రెండో గేమ్‌లో లక్నో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో అన్ని విభాగాల్లోనూ ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్లు చేతులు ఎత్తేశారు. దీంతో వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ బ్యాటర్లు.. బౌలర్ల ప్రదర్శన దారుణంగా ఉంది.
టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్..
టీ20 అంటేనే ఒకరకమైన ఊపు ఉంటుంది. అభిమానులు కూడా క్రికెటర్ల నుంచి అలాంటి ఆటనే కోరుకుంటారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ జట్టు బ్యాట్స్‌మెన్స్ మాత్రం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు మ్యాచ్ తరహా బ్యాటింగ్‌లో విసుగు తెప్పించారు. కనీసం 100 స్ట్రయిక్ రేట్‌ను కూడా మెయింటేన్ చేయలేకపోయారు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా కోచ్‌లపై గుర్రుగా ఉన్నారు. టెస్టు ప్లేయర్లను కోచ్‌లుగా పెట్టుకుంటే ఇలా కాకపోతే ఎలా ఆడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లారా శిక్షణలో ఇంతకంటే ఎక్కువ ఆశించలేం..
ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్‌గా బ్రియాన్ లారా ఉన్నారు. టెస్టు ఫార్మాట్‌లో లారా అద్భుతాలు చేసిన ప్లేయర్. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇతడు పెద్దగా రాణించింది లేదు. టీ20 ఫార్మాట్‌లో పెద్దగా ఆడని ప్లేయర్. ఆయనను హెడ్ కోచ్‌గా పెట్టుకోవడం సన్ రైజర్స్ చేసిన తప్పంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ టెస్టు ఆట కాదని, ధనాధన్ ఆట అని పేర్కొంటున్నారు. ఇక్కడ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన టోర్నీలో దూకుడుగా ఉండే వ్యక్తిని కోచ్‌గా నియమించుకుంటే జట్టులో ప్లేయర్స్ ఆట మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు. సన్ రైజర్స్ బాగుపడాలంటే వెంటనే కోచ్‌ను మార్చాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మేనేజ్‌మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.