
AP IAS Officers Transfers: ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా 57 మంది ఐఏఎస్ ల బదిలీ. అందులో ఏకంగా ఎనిమిది మంది కలెక్టర్లు ఉన్నారు. ఇంత సడన్ గా ఇంతమంది ఐఏఎస్ ల బదిలీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఏరికోరి బదిలీలు చేసింది ఎందుకు? ముందుగానే పలానా జిల్లాకు పలానా కలెక్టర్ వస్తున్నారంటూ ప్రచారానికి ఉప్పందించిదెవరు? వైసీపీ సోషల్ మీడియాకు ముందుగానే లీకు చెసిందెవరు? దీని వెనుక ఉన్న మర్మమేంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి వేళ్లు అటువైపే చూపుతున్నాయి. ఏపీలో ఎన్నికల సీజన్ ప్రారంభమవుతున్న వేళ,, సీఎం జగన్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఐఏఎస్ లను మార్పు చేశారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే కలెక్టర్ల నుంచి అధికారుల దాకా స్టడీ చేసి నివేదిక ఇవ్వడంతోనే సీఎం జగన్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
ఎన్నికల టీమ్ కోసమేనా?
భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి సోషల్ మీడియాలోనూ ఎవరికి తోచినట్లుగా వారు ఓ రేంజ్‌లో ప్రశ్నలు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కానీ జగన్ ఏదిచేసినా వ్యూహాత్మకంగా చేస్తారన్న టాక్ ఉంది. ఇదంతా ఎన్నికల టీమ్ గా అనుమానిస్తున్నవారు ఉన్నారు.మరో ఏడాదిలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను భారీగా మార్చడం వెనుక మతలబు దాగి ఉందని చెబుతున్నారు. ఇంకొందరైతే ఎన్నికల ముందే ఇవన్నీ మామూలే అని… ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని తెచ్చుకోవడం, నమ్మకస్తులను వారికి కావాల్సిన చోటికి బదిలీ చేసేయడం కామన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తెర వెనుక ఏదో జరుగుతోందని ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు.ఇప్పట్నుంచే ఆయా జిల్లాలపై కలెక్టర్లు పట్టు పెంచుకుంటే ఎన్నికల టైమ్‌కు అన్నీ సెట్ చేసుకోవచ్చన్నది జగన్ మనసులో ఉందని అనుమానిస్తున్నారు.
ఎమ్మెల్యేల ఫిర్యాదులతో…
అయితే జగన్ ఒకరి మాటకు ప్రాధాన్యమిస్తారు. వారు చెప్పిన మాట జవదాటరు. చెప్పింది పాటిస్తారు. ఐఏఎస్ ల బదిలీ వెనుక వారి ప్రమేయం అధికంగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారే ఐ ప్యాక్ టీమ్. వారు చెప్పినట్లుగానే సీఎం జగన్ అధికారులకు స్థానచలనం కలిగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. చాలా రోజులుగా ఏపీలోని కొందరు కలెక్టర్లకు, వైసీపీ ఎమ్మెల్యేలకు పడట్లేదన్నది జగమెరిగిన సత్యమే. పలు సందర్భాల్లో ఈ వ్యవహారాలన్నీ బయటికొచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఆ అధికారులే ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని.. కచ్చితంగా మార్చి తీరాల్సిందేనని కొందరు ఎమ్మెల్యేలు.. జగన్‌ను పట్టుబట్టారట. మరికొందరు ఎమ్మెల్యేలు అయితే జగన్‌కు పదే పదే ఫిర్యాదులు కూడా చేశారట. ఏప్రిల్-3న జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మరోసారి ఈ విషయాలన్నీ జగన్ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారట. దీంతో ఎమ్మెల్యేల టార్చర్ తట్టుకోలేక ఫైనల్‌గా ఇలా 57 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయాల్సి వచ్చిందట. అంతేకాదు త్వరలోనే భారీగా ఎస్పీలు బదిలీ అవుతారని కూడా టాక్ నడుస్తోంది.

వారిపై చల్లారని కోపం…
కొందరు కలెక్టర్లపై కోపంతో బదిలీ వేశారన్నటాక్ వినిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రీకౌంటింగ్ కు సహకరించలేదని అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మిని విజయనగరం బదిలీ చేశారు. అప్రాధాన్యత పోస్టు లేకుండా ఉండడం ఆమెకు కొంత ఉపశమనం. శాప్‌లో ఉద్యోగులతో నిరసన, తీవ్ర వివాదాలు ఎదుర్కొని వెయిటింగ్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డిని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమించారు. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌పీ సిసోడియా విషయం మరింత దయనీయం. గత ఫిబ్రవరి 4న ఆయన్ను గవర్నర్ కార్యాలయం నుంచి బదిలీ చేసి వెయిటింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. గతంలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను అవమానకర రీతిలో తొలగించి ఇదే హెచ్‌ఆర్‌డీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు సిసోడియా వంతు వచ్చిందన్న మాట. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో తమకు పనికొస్తారన్న వారికి ప్రాధాన్యత పోస్టులు.. ధిక్కార స్వరం వినిపించేవారి అప్రాధాన్యత పోస్టులను కట్టబెట్టారన్న మాట. అయితే భారీగా ఐఏఎస్ ల బదిలీ వెనుక ఎన్నికల వ్యూహాలను రూపొందించే ఐ ప్యాక్ టీమ్ హస్తం ఉందన్న వార్తలు బ్యూరోక్రసీ వ్యవస్థలో అసంతృప్తికి కారణమవుతున్నాయి.