
Cheemalapadu Blast: పార్టీ పత్రికలు అంటే భజన మాత్రమే కాదు.. అసలు విషయాలను కూడా దాచి పెట్టాలి..ఈ తరహా జర్నలిజంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది నమస్తే తెలంగాణ. ఎందుకంటే నిన్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన విషాదాన్ని ఆ పత్రిక చాలా తేలిగ్గా తీసుకుంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయి, పదుల కొద్ది ప్రజలు గాయాల పాలైతే.. కనీసం ఆ వార్తను వార్త లాగా రాలేకపోయింది. ఆ ప్రమాదంలో సిలిండర్ మాత్రమే పేలిందని రాసుకొచ్చింది. ఆ ప్రమాదానికి కారణం ముమ్మాటికి భారత రాష్ట్ర సమితి కార్యకర్తల అత్యుత్సాహం. మండే ఎండాకాలంలో బాణాసంచా పేల్చి అగ్ని ప్రమాదానికి కారణమైంది వారే. బాణసంచా అగ్గి రవ్వ లు పూరీళ్ళు మీద పడి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆ గుడిసెలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అందులో ఒకదానిని ఒక హోంగార్డు గుర్తించి బయటికి తీశాడు. మరొకటి ఆ గుడిసెలో బీరువా పక్కన ఉంది. దానిని హోంగార్డు గుర్తించలేకపోయాడు. మంటల ధాటికి సిలిండర్ పేలింది.. వాస్తవానికి 250 డిగ్రీల టెంపరేచర్ ని కూడా గ్యాస్ సిలిండర్ తట్టుకుంటుంది. కానీ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో 300 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తోంది.ఆ వేడి వల్లే గ్యాస్ సిలిండర్ పేలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఉదయం లేస్తే భారతీయ జనతా పార్టీ మీద అంతెత్తున ఎగిరిపడే నమస్తే తెలంగాణ.. అగ్ని ప్రమాదంలో తన పార్టీ కార్యకర్తలు చనిపోతే మాత్రం అసలు విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది.. వార్తను వార్తలాగా కాకుండా ఏదో అగ్నిప్రమాదం జరిగినట్టు చిత్రీకరించింది. అసలు ఆ అగ్ని ప్రమాదానికి కారణం భారత రాష్ట్ర సమితి కార్యకర్తల అత్యుత్సాహం. మాడు పగలగొట్టే ఎండలో బాణసంచా కాల్చితే ప్రమాదం జరుగుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారు. కనీసం అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు వారిని వారించే ప్రయత్నం చేయలేదు.
వాస్తవానికి ఖమ్మం జిల్లాలో గత కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితి నేతలు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు అధిపత్యాన్ని ప్రదర్శించే విధంగా సాగుతున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీకి దూరంగా ఉండటం, కూడా భారీ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండడంతో వాటికి పోటీగా భారత రాష్ట్ర సమితి నాయకులు సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఏర్పాట్లలో హంగూ ఆర్భాటం ప్రదర్శిస్తున్న నేతలు.. కార్యకర్తలకు కనీసం భోజనాలు కూడా పెట్టలేకపోతున్నారు. నా వైరా మండలం ఖానాపురం లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆశించనంత స్థాయిలో కార్యకర్తలు రాలేదు. దీంతో వచ్చిన అతిథులు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో మధ్యాహ్నం కావడంతో కార్యకర్తలు భోజనాల వద్ద ఎగపడ్డారు. ఆశించినంత స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

చీమలపాడు ఘటనకు సంబంధించి నమస్తే తెలంగాణ అసలు విషయాలను పక్కన పెట్టింది. అసలు ఈ ప్రమాదానికి కారణం కార్యకర్తలు బాణసంచా కాల్చడం.. అక్కడ గుడిసెలు ఉన్నప్పటికీ కార్యకర్తలు మద్యం మత్తులో హద్దు మీరారు.. బాణ సంచా వల్ల గుడిసె అంటుకుంటే.. అదేదో సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందని నమస్తే రాస్కొచ్చింది. ఆత్మీయ సమ్మేళనాలు అని చెబుతున్నప్పుడు ఇంత హంగామా దేనికి? ఈ స్థాయిలో బాణాసంచా పేల్చడం దేనికి? మండే ఎండల్లో బాణసంచా పేల్చితే ప్రమాదాలు జరుగుతాయని నేతలకు తెలియదా? మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు చనిపోయారు.. పదులకొద్ది ప్రజలు గాయాల పాలయ్యారు. ఈ ఘటన వెనుక మాకు అనుమానం ఉందని ఎంపీ నామ నాగేశ్వరరావు చెబుతున్నారు..ఆయన కూడా అచ్చం నమస్తే తెలంగాణ లాగానే మాట్లాడుతున్నారు.. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రజ్యోతి చేసిన రిపోర్టింగ్ క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఆత్మీయ సమ్మేళనం ప్రదేశంలో కార్యకర్తల అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి కారణమైందని, అనుమతి లేకుండా బాణసంచా పేల్చడమే ఈ దారుణానికి హేతువైందని కుండబద్దలు కొట్టింది.. పొరుగు రాష్ట్రాల్లో, ప్రతిపక్ష నాయకులు ఉన్న ప్రాంతాల్లో ఏ చిన్న ఘటన జరిగినా భూతద్దం పెట్టి మరీ వార్త రాసే నమస్తే తెలంగాణ.. తన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన దారుణాన్ని మాత్రం అగ్ని ప్రమాదంగా చిత్రీకరించింది. ఆత్మ స్తుతికి, పర నిందకి అసలయిన అర్థం చెప్పింది.