Ghost Flights: కరోనా మహమ్మారి కారణంగా డీలా పడిన వాటిలో ఏవియేషన్ రంగం కూడా ఉంది. కొవిడ్ కష్టాలు అధిగమించినా..విమానయాన సంస్థలకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో దారుణమైన పరిస్థితులను ప్రకటించింది. విమానయాన రంగానికి తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షల కోట్ల నష్టం తప్పదని హెచ్చరించింది. దీంతో ఏవియేషన్ రంగంపై ఆధారపడ్డ ఉద్యోగులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఏవియేషన్ సంస్థలు కష్టమైనా, నష్టమైనా విమాన సర్వీసులు మాత్రం తగ్గించడం లేదు. కొన్ని దేశాలకు సంబంధించి సంస్థలైతే విమానాలను ఖాళీగా తిప్పుతున్నాయి. కనీసం వాటికి నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి. యూరప్ లో డజన్ల కొద్ది విమానాలు ప్రతీ నెల ఖాళీగా తిరుగుతుంటాయి. వీటికి గోస్ట్ ఫ్లైట్లుగా పరిగణిస్తారు.

ఒక ఫ్లైట్ ఎగరాలంటే కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది..పైలెట్ల నుంచి సిబ్బంది వరకూ పదుల సంఖ్యలో సిబ్బందికి జీతాలు ముట్టజెప్పాలి. ఆపై ఇంధన ఖర్చులు, నిర్వహణ ఖర్చులు చూడాలి. కానీ కొవిడ్ తరువాత విమానం ఎక్కేవారు తగ్గిపోయారు. ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అలాగని విమాన సర్వీసులు నిలుపుదల చేస్తామంటే కుదరదు. కచ్చితంగా నిబంధనల ప్రకారం విమాన సర్వీసులు కొనసాగించాల్సి ఉంటుంది. సరిగ్గా సర్వీసులు నడపకుంటే విమానాశ్రయాలు స్లాట్ లను రద్దుచేస్తాయి. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఒక సారి స్లాట్ కేన్సిల్ అయితే దొరకడం గగనమే. అందుకే నష్టాలని తెలిసినా, ప్రయాణికులు లేకపోయినా విమాన సర్వీసులు నడపాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరిగే ఫ్లైట్స్ ను గోస్ట్ ఫ్లైట్స్ గా చెబుతుంటారు. యూరప్ లో ఇటువంటివి ఎక్కువగా తిరుగుతుంటాయని గణాంకాలు చెబుతున్నాయి.
లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాలో గోస్ట్ ఫ్లైట్లు ఎక్కువగా తిరుగుతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. విమానంలో 100 సీట్లు ఉంటే కనీసం పది సీట్లు కూడా భర్తీకాని పరిస్థితి ఈ ఫ్లైట్లలో ఎక్కువగా కనిపిస్తోంది. విమానాశ్రయాల్లో స్లాట్ కంటిన్యూ కావాలంటే తమ విమాన సర్వీసుల్లో 80 శాతం ఖచ్చితంగా రాకపోకలు సాగించాలన్న నిబంధన ఏవియేషన్ సంస్థలకు గుదిబండగా మారింది. అటు స్లాట్ కోసం షెడ్యూల్ అమలు చేయలేక.. ఇటు విమానానికి సంబంధించి నిర్వహణ సక్రమంగా చేయలేక చాలా విమానయానసంస్థలు నష్టాలబాట పడుతున్నాయి.

ప్రయాణికులతో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో స్లాట్లకు భలే గిరాకీ ఉంటుంది. ఇటువంటి వాటిలో స్లాట్ వదులుకునేందుకు విమానయాన సంస్థలు ఇష్టపడవు. నష్టమైనా భరించేందుకు సిద్ధపడతాయి. ఎందుకంటే ఎప్పటికైనా పురోగతి ఉంటుందన్నది వాటి ఆశ. కానీ విమానయాన సంస్థలు పెరగడం, విమానాల రాకపోకలు పెరగడంతో విమానాశ్రయాలు రద్దీగా మారుతున్నాయి. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో యూఎస్ వంటి దేశాలు విమాన సర్వీసులు సక్రమంగా నడుపుకోకుంటే స్లాట్ వదులుకోండి అని గట్టిగా చెబుతున్నాయి. దీంతో విమానయాన సంస్థలు తమ షెడ్యూల్ ప్రకారం ప్రయాణికులు ఉన్నా, కార్గో సర్వీసు లేకున్నా నిర్థిష్ట సమయానికి ల్యాండింగ్, టేకాప్ మెంటేయిన్ చేస్తున్నాయి.వందలాది సీట్లు ఖాళీగా ఉంటూ.. దేయ్యాల ప్రయాణం మాదిరిగా విమానాలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది.