
Tammineni Veerabhadram: పొద్దున్నే నమస్తే తెలంగాణలో ఒక వార్త… “భారత రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తాం, భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొనం, కాంగ్రెస్ పార్టీకి భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనే సత్తా లేదు. ” తమ్మినేని వీరభద్రం మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ రాసిన వార్త ఇది.. నిజంగానే ఈ తెలంగాణలో ఇంకా కమ్యూనిస్టులు ఉన్నారా? ఉంటే వారు అధికారం కోసం ఎలాంటి పనులైనా చేస్తారా? పుచ్చలపల్లి సుందరయ్య వారసులు వీరేనా? అసలు కమ్యూనిజం అనేది అధికారాన్ని కోరుకుంటుందా? ఉద్యమాలలో పాల్గొననప్పుడు, అధికార పార్టీ పంచన చేరినప్పుడు ప్రజా సమస్యలు ఎలా వెలుగులోకి వస్తాయి? మార్క్సిజం, లెనినిజం ఇదే నేర్పుతుందా? అంటే ఈ ప్రశ్నలకు తమ్మినేని వీరభద్రం సమాధానం చెప్పలేడు కావచ్చు.
వాస్తవానికి తెలంగాణలో కొద్ది గొప్పో కమ్యూనిజం బతికి ఉందంటే అది ఖమ్మం జిల్లాలో మాత్రమే. ఇక ఆ సీపీఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలకు ఖమ్మం జిల్లా నాయకులు రాష్ట్రస్థాయిలో సారథ్యం వహిస్తున్నారు. ఇందులో న్యూ డెమోక్రసీ మినహాయిస్తే.. సిపిఎం, సిపిఐ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఫోల్డ్ లోకి వెళ్లిపోయాయి. కేసి ఆర్ ఇలా పిలవడమే ఆలస్యం.. అలా ప్రగతి భవన్ లో వాలిపోయాయి. మునుగోడులో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిస్తే తమ అభ్యర్థి గెలిచినంత సంబరపడ్డాయి. ఇంతా చేస్తే వచ్చిన మెజారిటీ 10,000. ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏందయ్యా అంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బొంద పెడతాయట, దీనికోసం భారత రాష్ట్ర సమితి కి జై కొడతాయట.. నిండు శాసనసభలో సూది దబ్బుణం అని కేసీఆర్ విమర్శిస్తే కనీసం కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్న ఈ పార్టీలో, కెసిఆర్ పల్లకి మోయడం నిజంగా ఆశ్చర్యకరమే

గతంలో పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు ఉన్నప్పుడు కమ్యూనిస్టులకు జనాల్లో ఆదరణ ఉండేది. అని ఎప్పుడైతే క్రోనీ క్యాపిటల్ ఇజం కమ్యూనిస్టు పార్టీల్లో చొరబడిందో అప్పుడే అవి తమ ప్రభావాన్ని కోల్పోవడం ప్రారంభించాయి. ఏదో ఒక అధికార పార్టీ చందన చేరడం మొదలుపెట్టాయి. అప్పట్లో టిడిపికి మద్దతు ఇచ్చాయి. తర్వాత కాంగ్రెస్ కు సపోర్ట్ చేశాయి. ఇప్పుడు మళ్లీ గులాబీ కండువా మెడలో వేసుకున్నాయి. ఇన్ని పార్టీలకు సపోర్ట్ చేసే బదులు సొంతంగా ఎదగాలనే సోయి ఆ పార్టీలకు లేదు. టోకున అమ్మడం మొదలు పెట్టిన తర్వాత వారు చేయగలిగింది మాత్రం ఏముంటుంది.
ఇవాళ బీజేపీపై నిప్పులు చె చెరుగుతున్న తమ్మినేని వీరభద్రం.. తన సొంత గ్రామం తెల్దారుపల్లిలో, సొంత బాబాయ్ తమ్మినేని కృష్ణయ్యను వీరభద్రం సోదరుడే హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తమ్మినేని వీరభద్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా భారతీయ జనతా పార్టీని బొంద పెడతానని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. ఇలా చేయబట్టే కదా జనాలు కమ్యూనిస్టులు అంటేనే ఈసడించుకునేది.. ఇలాంటి స్వ ప్రయోజనాల కోసం కమ్యూనిజాన్ని తాకట్టు పెడుతున్నారనే కదా జాతీయ పార్టీ హోదా కూడా పోయింది.. అయినప్పటికీ ఇంకా పక్క పార్టీల పల్లకిలు మోయడం దేనికి తమ్మినేని? అయినా కమ్యూనిస్టుల బలం ఎంతని? అది లేకే కదా ఇప్పుడు గులాబీ కండువా మెడలో వేసుకున్నది. అయినా తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేము అని చెబుతున్న మీరు.. దేశంలో ఎలా చేస్తారు? వాటిని ప్రజలు ఎలా నమ్ముతారు? ఏంటో ఈ మధ్య అందరూ కే ఏ పాల్ నయం అన్పించేలా మాట్లాడుతున్నారు.