Wayanad Tiger: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి మనుషుల రక్తానికి మరిగింది. ఇటీవల మనంతవాడి సమీపంలో ఒక కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ(45) అనే మహిళపై క్రూరంగా దాడి చేసింది. అమాంతం చంపేసింది. ఆ దాడిలో రాధ శరీర భాగాన్ని సగానికంటే ఎక్కువ తినేసింది. అక్కడి నుంచి నేరుగా మనంతవాడి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. అడవిలో అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడిలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ పులిని మనుషుల రక్తానికి మరిగిన మృగంగా అధికారులు ప్రకటించారు. కనిపిస్తే చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నాటి నుంచి ఆ పులిని చంపేయడానికి అటవీశాఖ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రంగంలోకి పులిని చంపగల నేర్పరితనం ఉన్న వ్యక్తులను దింపారు. కొద్దిరోజులుగా మనంత వాడి.. దాని సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అధికారులకు ఓ వార్త అందింది. మనంతవాడి సమీపంలో మనుషుల రక్తానికి మరిగిన పులిగా పేరుందిన మృగం చనిపోయిందని దాని సారాంశం.. దీంతో అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ఆ పులిని నిశితంగా పరిశీలించారు. ఎందుకైనా మంచిదని పోస్టుమార్టం నిర్వహించారు.. అయితే ఇక్కడే వారికి సంచలన విషయాలు తెలిశాయి.
కడుపులో ఆ వస్తువులు
పులి పిలకావు అనే ప్రాంతం వద్ద చనిపోయింది. పాడుబడిన ఇంటి వెనక పులి కళేబరం అధికారులకు లభ్యమైంది. పులిపై దారుణమైన గాయాలు కనిపించాయి. అయితే దానిపై ఒక క్రూరమైన మృగమే దాడి చేసి ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ పులికి పోస్టుమార్టం నిర్వహించగా.. దాని కడుపులో వెంట్రుకలు కనిపించాయి. ఒక జత చెవి రింగులు లభ్యమయ్యాయి. అయితే రాధ పై దాడి చేసి చంపిన పులి ఇదేనని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు.. రాధ ఈ పులి చేతిలోనే బలైందని అంచనా వేశారు..” ఆ పులి చనిపోయింది. ఒక క్రూరమృగం దాడి చేయడంతో అది ప్రాణాలను కోల్పోయింది. దాని కళేబరం పిలకావు ప్రాంతంలోని పాడుబడిన ఇంటి వెనకాల కనిపించింది. ఎందుకైనా మంచిదని పోస్టుమార్టం నిర్వహించాం. పులి కడుపులో మహిళ వెంట్రుకలు, చెవులకు ధరించే బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో రాధను చంపింది ఈ పులేనని నిర్ధారణకు వచ్చాం. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పులి కళేబరాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టామని” అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.