
Rain Alert In Telangana: తెలంగాణలో వాతావరణం మారింది. ప్రస్తుతం ఎండలతో ఉక్కపోత పోయాల్సి ఉండగా మొత్తం పరిస్థితి చల్లగా అయింది. ప్రతి సంవత్సరం అకాల వర్షాలు పడటం మామూలే. కానీ పంటల మీద వచ్చే వర్షాలు ఇప్పుడు పంటలకు ముందే వస్తున్నాయి. గత వారం రోజులుగా వాతావరణం చల్లబడిపోయింది. మబ్బులు కమ్ముకుంటున్నాయి. చలి తీవ్రమవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు పడటం కామనే. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాతావరణంలో మార్పులు రావడం గమనార్హం.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని చెబుతోంది. దీంతో రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
వడగళ్ల వానలు పడతాయా?
సాధారణంగా ఈ సమయంలో పడే వానలు వడగళ్ల వానలే. పంటలు దెబ్బతినేలా చేసేలా వర్షాలు పడతాయి. చాలా సార్లు ఇలాంటి వానలతో రైతులు ఎంతో నష్టపోయారు. ఈ సారి కూడా ఆ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. పలు జిల్లాల్లో కురిసే వర్షాలతో రైతులకు నష్టం జరుగుతుందో ఏమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతులు దిగులు చెందుతున్నారు. అకాల వర్షాల ప్రభావంతో తమ పంటలు ఏమవుతాయో అనే బెంగ వారిలో పట్టుకుంది.

మామిడికి భారీ నష్టమేనా?
ఈ నేపథ్యంలో మామిడి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లనుంది. వడగళ్ల వాన పడితే పూత, కాత అంతా రాలుతుంది. దీంతో మామిడి రైతులకు మిగిలేది దుఖమే. ప్రకృతి వైపరీత్యాలకు భారీగా నష్టపోయేది రైతులే. ఆరుగాలం పండించిన పంట అరగంటలో నేల రాలడం చూసి గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమి ఉండదు. వాతావరణ శాఖ సూచనలతో రైతులు దీనంగా చూస్తున్నారు. తమ పంటలకు ఇక రక్షణ ఎలా అని మథనపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా రైతులకు ఓదార్పు దక్కడం కష్టమే.