
Warangal Medico Case: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యలో పీజీ చేస్తున్న ప్రీతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె ప్రస్తుతం హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.. ఇక ఈ సుకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించిన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి విస్మయకర వాస్తవాలు తెలుస్తున్నాయి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు ఇద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలించి, వారి వాట్స్అప్ చాటింగ్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అయితే సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్టు వాట్స్అప్ చాట్స్ ద్వారా తెలుస్తోంది. తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి చాలా ఎక్కువ చేస్తోందని చెప్పినట్టు ఆధారాలు లభించాయి.. అంతేకాదు సైఫ్ వేధింపులు తట్టుకోలేక ప్రీతి అతడిని నిలదీసింది. తనను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని బతిమిలాడింది. ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందు వల్లే ఆత్మహత్యకు యత్నించిందని పోలీసుల విచారణలో తేలింది.
వాట్సాప్ గ్రూప్ లో
కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల హవా కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ జూనియర్లను సీనియర్లు ఒక ఆట ఆడుకుంటుంటారు. సలహాల పేరుతో సార్ అని పిలిపించుకుంటారు. ఈ క్రమంలో భాగంగా తనకంటే జూనియర్ అయిన ప్రీతిని సైఫ్ టార్గెట్ చేశాడు. వాట్సాప్ గ్రూప్ లో ఆమెను లక్ష్యంగా చేసుకొని మాట్లాడేవాడు. అంతేకాదు ఆమెకు బుర్ర తక్కువ ఉందంటూ ఎగతాళి చేసేవాడు. ఇది తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. వాస్తవానికి ప్రీతి అనస్థీషియా స్టూడెంట్. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాక అదే మార్గాన్ని ఎంచుకుంది. గూగుల్ లో సెర్చ్ చేసిన తర్వాత సక్సి నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ వేసుకుంది. అయితే ఆత్మహత్యకు యత్నించక ముందు తన తండ్రి నరేందర్ తో కలిసి ప్రీతి సైఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీనియర్లు అయినంత మాత్రాన తనను టార్గెట్ చేస్తారా అని స్నేహితులతో వాపోయింది.. ఇక ఎంత చెప్పినా సైఫ్ తన బుద్ధి మార్చుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది.
ఇక ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన సైఫ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడిని ఖమ్మం జైలుకు తీసుకొచ్చారు. సైఫ్ మీద ర్యాగింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మొదట్లో సైఫ్ కు రాజకీయ నేపథ్యం ఉంది అని ప్రచారం జరిగింది. అలాంటిది ఏమీ లేదని పోలీసులు తేల్చి చెప్పేశారు. లైఫ్ ఒక సాధారణ కుర్రాడని, స్థూలంగా చెప్పాలంటే ఒక పేద విద్యార్థి అని పోలీసులు స్పష్టం చేశారు. సైఫ్ తండ్రి రైల్వే శాఖలో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు వివరించారు.. ఇక ప్రీతి ఆరోగ్యం శుక్రవారం రాత్రి నాటికి కూడా కుదుటపడలేదు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ” నా బిడ్డను చూస్తే జాలేస్తోంది. కనీసం చలనం కూడా లేదు.. ప్రభుత్వం, వైద్యులు మాత్రం చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు,.. మమ్మల్ని మాయ చేస్తున్నారు”అంటూ ప్రీతి తండ్రి నరేందర్ వాపోయాడు.

మరోవైపు ఇదంతా జరుగుతుండగానే కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థుల వద్ద మాదకద్రవ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని పోలీసులు కొట్టి పడేశారు. ప్రతి వైద్య విద్యార్థి దగ్గర డ్రగ్స్ కిట్ ఉంటుందని, వాటిని మాదకద్రవ్యాలు అనుకోవడం తప్పని పోలీసులు అంటున్నారు.. ఇక ప్రీతిని వేధించిన సైఫ్ ను ఖమ్మం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు..