
Punch Prasad Health: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు తీవ్ర కిడ్నీ సమస్య ఉంది. రెండు మూత్రపిండాలు పాడైపోయిన నేపథ్యంలో పరిస్థితి విషమించింది. ట్రీట్మెంట్ తో పంచ్ ప్రసాద్ నెట్టుకొస్తున్నారు. ఆ మధ్య పంచ్ ప్రసాద్ నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తోటి కమెడియన్ నూకరాజు వీడియో ద్వారా తెలియజేశారు. ఆయన రెండు కాళ్ళు విపరీతంగా ఉబ్బిపోయాయి. కాలుతీసి అడుగు పెట్టలేని దుస్థితిలో భార్య దగ్గరుండి సేవలు చేశారు.
పంచ్ ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన ప్రస్తుత కండీషన్ గురించి వెల్లడించారు. అలాగే తనకు ఈ సమస్య ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. నాకు చిన్నప్పటి నుండి బీపీ ఉండేది. ఊరికే కోపం వచ్చేది. ఒకరోజు నా వైఫ్ నేను హెల్త్ చెకప్స్ కి వెళ్ళాము. డాక్టర్ బీపీ చెక్ చేసి 220 ఉందని చెప్పారు. ఆయన సమస్య పెద్దదే, మీరు పెద్ద హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు. అప్పుడు వేరే హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అప్పుడే నాకు కిడ్నీ సమస్య ఉందని తెలిసింది. అయితే కిడ్నీలో రాళ్లు వంటి చిన్న సమస్య అనుకున్నానని పంచ్ ప్రసాద్ తెలిపారు.
ఇక పంచ్ ప్రసాద్ కి త్వరలో ఆపరేషన్ జరగాల్సి ఉంది. ఆయన ఒక సంస్థకు విజ్ఞప్తి చేసుకోవడంతో పంచ్ ప్రసాద్ బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయిన కిడ్నీ సమకూరుస్తున్నారు. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ఎవరు ఇస్తున్నారనేది తెలియదు. ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ అవయవాలు కుటుంబ సభ్యుల అనుమతితో సేకరిస్తారు. ఆ విధంగా లభించిన కిడ్నీ పంచ్ ప్రసాద్ కి అమర్చనున్నారు. రూల్స్ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే కిడ్నీ ఇవ్వాలని, భార్య కూడా వివాహమైన ఐదేళ్ల తర్వాత మాత్రమే ఇవ్వగలదని పంచ్ ప్రసాద్ చెప్పారు.

అయితే పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి గాయాలు అడ్డుగా నిలుస్తున్నాయి. అతని కాలి నుండి మూడు కప్పుల చీము తీశారట. ఆ గాయం మానితే తప్ప ఆపరేషన్ చేయరు. ఇక వారానికి మూడుసార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నారట. ఎక్కువ నీళ్లు తాగకూడదట. నీరు ఎక్కువైతే నాలుగు సార్లు చేయించాల్సి వస్తుందట. ఆపరేషన్ జరిగాక ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని పంచ్ ప్రసాద్ వెల్లడించారు. తన భార్య, జబర్దస్త్ కమెడియన్స్ మద్దతుగా నిలబడ్డారని ఆయన చెప్పుకొచ్చారు.