Vetapalem: అనగనగా ఓ మంత్రి గారు.. అధికార పార్టీ కావడంతో బాగా “డబ్బు” చేశారు. ఆ డబ్బుతో విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. గతంలో ఆ వ్యవసాయ క్షేత్రానికి మట్టి రోడ్డు ఉండేది. ఆ మట్టి రోడ్డుమీద కారు నడుపుకుంటూ వెళ్లడం అంటే ఆ మంత్రి గారికి మహా సరదాగా ఉండేది. ఆ మట్టి రోడ్డు పక్కనే చాలావరకు పెంకుటిళ్లు, ఒక మోస్తారు ఇళ్లు ఉండేవి. ఆ మట్టి రోడ్డును సిసి రోడ్డుగా మార్చాలని ఎప్పటినుంచో ఆ ప్రాంత ప్రజలు అధికారులను కోరడం.. వారు పక్కన పెట్టడం.. ఇలా నిత్య వ్యవహారం లాగా జరుగుతూనే ఉండేది. అయితే ఈసారి వచ్చిన అధికారి కాస్త నిజాయితీపరుడు కావడంతో.. ఆ రోడ్డును చూసి అతడికి ఎలాగైనా సీసీ రోడ్డుగా మార్చాలనే తలంపు పుట్టడంతో.. రెండవ మాటకు తావు లేకుండా ఆ గ్రామస్తుల విన్నపాన్ని ఓకే చేశాడు.. ఇంకేముంది మరుసటి రోజు అధికారులు వచ్చారు.. కొలతలు తీసుకున్నారు.. ఇది మంత్రి గారికి తెలిసింది. ఇంకేముంది రోడ్డును ఆపేశాడు. ఇప్పటివరకు ఆ రోడ్డును వేయలేదు. ఇకపై వేసే అవకాశం లేదు.. ఇది కల్పితం కాదు. కాకపోతే వివరాలు బయట పెట్టడం భావ్యం కాదు కాబట్టి అలా రాసుకుంటూ పోయాం.
Also Read: అనూహ్యంగా ఊహించని నేతకు బిజెపి పగ్గాలు!
వ్యవస్థ చూస్తూ ఉండిపోయింది
ఈ కథనం ప్రారంభంలో వ్యవస్థ, వ్యక్తుల గురించి ప్రస్తావించాం కదా.. అయితే వ్యవస్థను లెక్కచేయని మనుషుల వల్ల ఎలాంటి దారుణాలు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామం. అక్కడ ఓ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలని నిర్ణయించారు. ఆ రోడ్డు వేయకూడదని ఓ డబ్బు చేసిన వ్యక్తి దబాయింపు. తనకున్న బలంతో అధికారులను అడ్డుకున్నాడు. రోడ్డు వేయవద్దని గట్టిగా అడ్డగించాడు. కానీ ఓ సందర్భంలో రోడ్డు వేయాల్సి వచ్చింది. అధికారులు వచ్చారు.. కొలతలు తీసుకున్నారు.. అయితే రోడ్డు ఎలా వేస్తారో చూద్దామని రోడ్డు పక్కనే తన కారును పార్కింగ్ చేశాడు. ఎన్ని రోజులకు ఆ కారును తీయలేదు. తీయడానికి ప్రయత్నించలేదు. అధికారులు చెప్పి చూశారు.. వినిపించుకోలేదు.. పోలీసులు వస్తే ఇంటికి తాళం వేసింది. బలవంతంగా కారును పక్కన పెడతామంటే.. ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందోనని పోలీసులు కూడా కాస్త ప్రేక్షక పాత్రను ప్రదర్శించారు. కాంట్రాక్టర్ ఇంత జరుగుతున్నా ఊరుకోలేదు. జస్ట్ ఆ కారు పక్క నుంచి రోడ్డు వేసుకుంటూ వెళ్ళాడు. చూసే వాళ్లకు ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం లాగా కనిపిస్తుంది. కానీ ఇంకాస్త లోతుల్లోకి వెళ్తేనే వ్యవస్థ మీద ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి దబాయింపు కనిపిస్తుంది. అందువల్లే చూసే ప్రతి విషయాన్ని.. ఒకవైపు మాత్రమే కాదు.. రెండు వైపులా చూడాలి. అప్పుడే అసలు నిజం తెలుస్తుంది. కారు, సిమెంట్ రోడ్డు.. సింగిల్ కాలం వార్త మాత్రమే కాదు.. మన సమాజంలో నిత్యం జరుగుతున్న యదార్థాలకు, సంఘర్షణలకు దృశ్యరూపం కూడా..
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!