
Vande Bharat Aluminum Trains: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పరుగులు పెడుతున్నాయి. విస్తరించేందుకు ప్రత్యేక చొరవ తెడుకుంటోంది. ఈక్రమంలో
వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్లు పిలిచింది. రెండు ప్రైవేట్ కంపెనీలు బిడ్లు వేశాయి. అందులో ఒకటి హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఉంది. బిడ్ దక్కితే.. ICFతో పాటు ఈ కంపెనీ కూడా వందే భారత్ రైళ్లను తయారు చేస్తుంది.
ఇప్పటికే పది రైళ్ల పరుగు..
కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 రైళ్లు తిరుగుతుండగా.. మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తున్నారు.
– ఉత్పత్తి వేగం పెంచేలా..
తక్కువ సమయంలో ఎక్కువ రైళ్లను ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో వందే భారత్ రైళ్ల తయారీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే వందే భారత్ రైళ్ల తయారీకి టెండర్లను ఆహ్వానించింది. అల్యూమినియం బాడీతో 100 వందే భారత్ రైళ్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్టుకు ఇప్పటి వరకు బిడ్లు దాఖలయ్యాయి.
హైదరాబాద్ సంస్థ బిడ్..
తాజా టెండర్లలో హైదరాబాద్ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ బిడ్ వేసింది. ఈ సంస్థకు రైల్వే కోచ్‌లను తయారుచేసిన అనుభవం లేదు. అందుకే స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌తో కలిసి బిడ్ దాఖలు చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన రైల్వే దిగ్గజం అల్‌స్తోమ్ కూడా బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు కంపెనీలు రూ.30 వేలు కోట్ల కాంట్రాక్టు కోసం బిడ్లు దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టు కింద 100 వందేభారత్ రైళ్లను తయారు చేయడంతో పాటు 35 ఏళ్ల పాటు నిర్వహించాలి.

– మెట్రో రైళ్ల తయారీ..
ట్రైన్ 18 కాంట్రాక్ట్‌తో పాటుమెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీయే దక్కించుకుంది. శంకర్‌పల్లిలోని 100 ఎకరాల స్థలంలో రైల్వే కోచ్‌ల తయారీకి కొత్తగా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
– అల్యూమినయంతో తయారీ..
ప్రస్తుతం మన దేశంలో తిరుగుతున్న రైళ్లను ఉక్కుతో తయారు చేశారు. కానీ ఈ రైళ్లను మాత్రం అల్యూమినియంతో చేయనున్నారు. ఉక్కుతో తయారు చేసిన రైళ్లతో పోల్చితే.. అల్యూమినియం రైళ్లు తేలికగా ఉండి, అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇస్తాయి. హర్యానాలోని సోనిపత్‌లో వీటిని తయారుచేయనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఛైర్ కార్ ఫెసిలిటీ మాత్రమే ఉంది. అంటే కూర్చోవడానికి మాత్రమే వీలుంది. రాబోయే రోజుల్లో స్లీపర్ వందేభారత్ రైళ్లను కూడా తీసుకురానున్నారు. 2024 తొలి త్రైమాసికంలో తొలి స్లీపర్ వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుంది.
102 రైళ్ల తయారీకి ఆర్డర్..
ఇప్పటి వరకు 102 వందే భారత్ రైళ్లకు ఆర్డర్ ఇవ్వగా.. అందులో 10 ఆల్రెడీ తిరుగుతున్నాయి. మిగతావి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం చెన్నైలోని ఐసీఎఫ్‌లోనే వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. త్వరలోనే సోనిపత్ (హర్యానా), లాతుర్ (మహారాష్ట్ర), రాయ్ బరేలి (యూపీ)లో కూడా వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నారు.