
Robotic Elephant: దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. దేవుళ్ల ఊరేగింపు, శోభాయాత్రలు వీటిపైనే నిర్వహిస్తారు.
ప్రత్యేక శిక్షణ..
ముఖ్యంగా కేరళ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో ఏనుగులు ఎక్కువగా వినియోగిస్తారు. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. కేరళలోని ఆలయాల్లో భక్తులకు ఏనుగులు తొండంతో ఆశీర్వదిస్తాయి. అక్కడ ఇదో ఆచారం. ఇందుకోసం వాటికి చాలా ట్రైనింగ్ ఇస్తారు.
నలుగురి యువకుల ఆలోచన..
అయితే… వేడుకల పేరుతో మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని నలుగురు యువకులు ఏనుగుల ఇబ్బందులను గుర్తించారు. వారికి ఓ ఆలోచన తట్టింది. ఏనుగులను ఇబ్బంది పెట్టే బదులు రోబో ఏనుగుని తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనతో నలుగురు ఓ రోబో ఏనుగు రూపొందించారు.
నిజం ఏనుగులా..
యువకులు తయారు చేసిన రోబో ఏనుగు చూడటానికి అచ్చం నిజం ఏనుగులానే ఉండేలా తీర్చి దిద్దారు. ఇది రోబో ఏనుగు అని చెబితే కానీ గుర్తించలేని విధంగా అద్భుతంగా తయారు చేశారు. 11 అడుగులు పొడవుతో, 800 కిలోల బరువుతో దీన్ని రూపొందించారు. ఐరన్ ఫ్రేమ్, రబ్బర్ కోటింగ్ వినియోగించారు.

రూ.5 లక్షల ఖర్చు..
ఇంతకు దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చైందో తెలుసా..? అక్షరాల రూ.5 లక్షలు. దీనికి ఇరింజద పిళ్లై రామన్ అని పేరుకూడా పెట్టారు.. కేరళలో నిజమైన ఏనుగులు ఎలా అయితే ఆశీర్వదిస్తాయో.. ఈ రోబోటిక్ ఏనుగు భక్తులకు ఆశీర్వాదం అందిస్తోంది. 5 పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్స్‌తో ఈ ఎలిఫెంట్ మోడల్‌ను రూపొందించారు.
ఐదుగురు కూర్చునే ఏర్పాటు..
ఈ రోబో ఏనుగుపై ఒకేసారి ఐదుగురు కూర్చోవచ్చు. స్విచ్ సాయంతో ఏనుగు తొండాన్ని ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు ఏనుగు విగ్రహాలు తయారు చేసి పంపే బృందమే ఈ రోబోటిక్ ఏనుగుని తయారు చేసింది.
శ్రీకృష్ణ ఆలయానికి విరాళం..
ఈ రోబో ఏనుగును పెటా సంస్థ
త్రిశూర్‌లోని ఇరింజదప్పిల్లీ శ్రీకృష్ణ ఆలయానికి విరాళంగా అందించింది. పెటా సమక్షంలో సినీ నటి పార్వతి తిరువోతు చేతుల మీదుగా ఈ ఏనుగుని అందజేశారు.
రోబో ఏనుగును పరిశీలించిన ఆలయ అర్చకులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల్లోనూ నిజమైన ఏనుగులకు బదులుగా ఈ రోబో ఏనుగులను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
దాడుల భయం ఉండదు..
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వేడుకలు జరిగిన చాలా సందర్భాల్లో ఏనుగులు సడెన్ గా భక్తులపై దాడి చేశాయి. రోబో ఏనుగుతో ఆ బాధలు తప్పుతాయని అంటున్నారు. భక్తులు. పెటా సంస్థ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వీలైనంత వరకూ ఆలయాల్లో రోబో ఏనుగులను ఏర్పాటు చేయడం మంచిదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.