https://oktelugu.com/

Valentine’s Day: వాలెంటైన్స్ డే.. ఫిబ్రవరి 7-14 దాకా ఈవారంలో ప్రతిరోజూ ప్రత్యేకమే..

ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. ఆ నిజాయితీ అనేది వాగ్దానం ద్వారా వస్తుందని ప్రేమికులు నమ్ముతుంటారు. అందుకే ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 6, 2024 / 05:21 PM IST
    Follow us on

    Valentine’s Day: తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఎదుటి మనిషిని యధాతథంగా అంగీకరించేదే ప్రేమంటే. అలాంటి ప్రేమను ఆస్వాదించే ప్రేమికులు జరుపుకునేదే వాలెంటైన్స్ డే. ఫిబ్రవరి 14న వచ్చే ఈరోజు కోసం ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. తాము మనసిచ్చిన వారి కోసం ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చి ఆ రోజును గొప్పగా జరుపుకుంటారు. ఈ ఫిబ్రవరి 14ను వాలెంటెన్స్ డే అని ప్రకటించడం వెనుక పురాతన చరిత్ర ఉంది. పూర్వం సెయింట్ వాలెంటైన్ అనే యువకుడు రోమన్ పూజారి గా ఉండేవాడు. అతడు క్రైస్తవ జంటల ప్రేమ వివాహాన్ని రహస్యంగా జరిపిస్తాడు. అక్కడి చక్రవర్తి క్లాడియస్_11 కు వాలెంటైన్ చేసే పని ఆగ్రహం తెప్పిస్తుంది. దీంతో అతడు వాలంటైన్ కు ఫిబ్రవరి 14న మరణ శిక్ష విధిస్తాడు. అతని వర్ధంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ప్రేమ కోసం అతడు తన జీవితాన్ని త్యాగం చేశాడని కొనియాడుతారు.

    వాస్తవానికి ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల దినోత్సవమే. కానీ ఈ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. వాలెంటైన్స్ డే వేడుకలను మన దేశంలో కంటే పాశ్చాత్యులు విభిన్నంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డే తో వారు వేడుకలను ప్రారంభిస్తారు. 8న ప్రపోజ్ డే, 9 న చాక్లెట్ డే, 10న టెడ్డి డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే, 14 న వాలెంటైన్స్ డే గా జరుపుకుంటారు. ఈ 7 రోజులు పాశ్చత్య దేశాలలో వేడుకలు అంబరాన్నంటుతాయి. క్రిస్మస్ తర్వాత ఆ స్థాయిలో అక్కడ వందల కోట్ల వ్యాపారాలు జరుగుతాయి. హోటల్స్ నుంచి రిసార్ట్స్ వరకు కిటకిటలాడుతాయి. ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ప్రకటిస్తాయి. మన దేశం నుంచి కూడా పర్యాటకులు ప్రేమికుల రోజు వేడుకలను ఆస్వాదించేందుకు విదేశాలకు వెళుతూ ఉంటారు. అలా వారు వెళ్లే ప్రాంతాలలో యూరప్, అమెరికా దేశాలు ముందు వరసలో ఉంటాయి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఏడు రోజులు జరుపుకునే వేడుకలను ఒక్కసారి పరిశీలిస్తే..

    ఫిబ్రవరి 7 రోజు డే

    ఫిబ్రవరి వాలెంటెన్స్ డే ను ప్రేమికులు ఈ రోజుతో ప్రారంభిస్తారు. తాము ప్రేమించిన వారికి ఎరుపు రంగు గులాబీలను అందిస్తారు. ఎరుపు రంగు లోతైన ప్రేమను, గాడమైన అనుబంధాన్ని వ్యక్తీకరిస్తాయని వారు నమ్ముతారు. ఎరుపు రంగు గులాబీలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రేమ, ఆప్యాయతలు మరింత బలపడతాయనేది వారి నమ్మకం.

    ప్రపోజ్ డే, ఫిబ్రవరి 8

    ప్రేమంటే వ్యక్తికరించడం మాత్రమే కాదు.. ఒప్పుకోవడం కూడా. అందుకే రోజ్ డే మరుసటి రోజు ప్రేమికులు ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఆ రోజును వాళ్లు తొలినాళ్లల్లో ప్రపోజ్ చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటారు. ప్రపోజ్ డే అనేది ప్రేమ, జీవితకాల కలయికకు తోడ్పడుతుందని ప్రేమికులు నమ్ముతుంటారు.

    చాక్లెట్ డే, ఫిబ్రవరి 9

    చాక్లెట్ అనేది తీపిగా ఉంటుంది. అలా చాక్లెట్లు ఇచ్చి పుచ్చుకుంటే ప్రేమలో మాధుర్యం మరింత పెరుగుతుందనేది ప్రేమికుల నమ్మకం. అందుకే తాము మనసిచ్చిన వారి ద్వారా చాక్లెట్లు ఇచ్చి పుచ్చుకుంటారు.కొందరైతే ఖరీదైన చాక్లెట్లను బహుమతుల రూపంలో ప్యాక్ చేసి ఇష్టమైన వారికి ఇస్తారు. ఈ చాక్లెట్ డే నాడు ఇంగ్లీష్ దేశాలలో కోట్లల్లో లావాదేవీలు జరుగుతాయి.

    టెడ్డీ డే ఫిబ్రవరి 10

    టెడ్డీ అంటే ఇంగ్లీషులో ముద్దుగా అనే అర్థం వస్తుంది.. తాము ప్రేమించిన వారిని ముద్దు చేసేందుకు ఈ టెడ్డీ డే జరుపుకుంటారు. ఈ రోజున మృదువైన, అందమైన టెడ్డీ బొమ్మలను తాము మనసిచ్చిన వారికి బహుమతిగా ఇస్తారు. వారి వారి ఆర్థిక స్తోమత ఆధారంగా టెడ్డీ లను కొనుగోలు చేస్తారు.

    ప్రామిస్ డే ఫిబ్రవరి 11

    ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం. ఆ నిజాయితీ అనేది వాగ్దానం ద్వారా వస్తుందని ప్రేమికులు నమ్ముతుంటారు. అందుకే ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకుంటారు. ఈ రోజున భవిష్యత్తులో చేపట్టబోయే పనుల గురించి తమ భాగస్వాములకు ప్రామిస్ చేస్తారు. ఆ ప్రామిస్ కు కట్టుబడి ఉంటేనే ప్రేమ నిలబడుతుందనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం.

    హగ్ డే ఫిబ్రవరి 12

    హగ్ అంటే కౌగిలింత. ఒక మనిషిని చేతుల్లోకి తీసుకొని గట్టిగా అదిమి పట్టడం అనేది బలమైన ప్రేమకు సంకేతమని ప్రేమికులు నమ్ముతుంటారు. అందుకే ఫిబ్రవరి 12ను హగ్ డే గా జరుపుకుంటారు. నచ్చినవారిని హగ్ చేసుకుంటే ప్రేమ మరింత బలపడుతుందని ప్రేమికుల నమ్మకం.

    కిస్ డే ఫిబ్రవరి 13

    ప్రేమ అంటేనే భావోద్వేగాల కలయిక. ఆ భావోద్వేగాలను ముద్దు మరింత బలోపేతం చేస్తుంది. నాలుగు పెదవుల కలయిక ఎన్నో అనుభూతులను ప్రతిబింబిస్తుంది.. అందుకే ప్రేమికులు ఈ రోజుకు అమితమైన ప్రాధాన్యమిస్తారు. ముద్దు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఇద్దరం ఒకటే అనే భావన కలుగుతుందని ప్రేమికుల నమ్మకం.

    వాలెంటెన్స్ డే ఫిబ్రవరి 14

    ప్రేమికుల దినోత్సవానికి సంబంధించి చివరి రోజు ఇది. దీనిని వాలెంటెన్స్ డే అని పిలుస్తారు. ఇష్టం, ప్రేమ, బలమైన బంధం, సాన్నిహిత్యం, ఐక్యత, కలిసి సాగించే ప్రయాణం.. ఇన్ని అనుభూతుల కలయికే వాలెంటైన్స్ డే. ఈ రోజున ప్రేమికులు స్వేచ్ఛగా విహరిస్తారు. ఈ లోకంలో వారిద్దరు మాత్రమే ఉన్నట్టుగా ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు. బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు తదుపరి అడుగులు వేస్తారు. సాధారణంగా ఈ రోజున అయితే ఇంగ్లీష్ దేశాలలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. కొందరైతే సముద్రతీర ప్రాంతాల్లో ఏకాంతంగా గడుపుతారు.