Uttar Pradesh Groom: బంధువులందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. దీంతో ఆనందంగా వధువును తీసుకుని వరుడు తమ ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. వరుడు ఆ నూతన వధువును పుట్టింటి వద్దే దిగబెట్టేశాడు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఉంగరం కావాలని..
ఉత్తర ప్రదేశ్‌లోని తురక్‌వలీ గ్రామం నుంచి మగపెళ్లివారు ఊరేగింపుగా ఆలమ్‌పురి గ్రామానికి చేరుకున్నారు. ఆడపెళ్లివారు వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. రాత్రివేళ వివాహతంతు ఘనంగా ముగిసింది. అయితే ఆడపెళ్లివారు వరునికి బంగారు ఉంగరం, గొలుసు ఇచ్చుకోలేకపోయారు. దీంతో వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్యాణమండపం బయట నిలిపిఉంచిన కారు వద్దకు నేరుగా చేరుకున్నాడు. దీంతో వధువు కూడా వచ్చి అదే కారులో కూర్చుంది.
కొద్ది దీరం వెళ్లి మళ్లీ వెనక్కి..
వారు ప్రయాణిస్తున్న కారు వరుని ఇంటివైపు బయలుదేరింది. అయితే కొద్దిదూరం వెళ్లాక వధువు పుట్టింటివారికి ఫోన్ చేసిన వరుడు.. తాము వధువుతోపాటు తిరిగి వెనక్కి వస్తున్నామని చెప్పాడు. కొద్దిసేపటి తరువాత వధువు ఇంటికి చేరుకున్న వరుడు తనకు వెంటనే బంగారు ఉంగరం, గొలుసు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వధువు తాను అత్తారింటికి వెళ్లేదిలేదని తెగేసి చెప్పింది.
వరుడికి బడితె పూజ..
వధువు నిర్ణయంతో ఆమె తరఫు బంధువులు రెచ్చిపోయారు. వరునితోపాటు అతని తండ్రిని, మరో బంధువును తాళ్లతో కట్టేసి, తాము పెళ్లి ఖర్చుచేసిన రూ.6 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడితె పూజ కూడా చేశారు. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఠాణాలో పంచాయితీ..
పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ నిర్వహించారు. తర్వాత వరుని తరపువారు అమ్మాయి తరపువారి నుంచి తీసుకున్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. అలాగే ఈ పెళ్లికి ఆడపెళ్లివారు ఖర్చుచేసిన దానిలో 1.90 లక్షల రూపాయలు కూడా తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ వివాహం రద్దయ్యింది.