Moinabad Farm House Case: ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలు దేరితే ఏదో ఒక సెన్షేషన్ ఉంటుంది. కానీ ఈసారి అదే రిపీట్ అవుతుంది అనుకుంటే కెసిఆర్ ను మొయినాబాద్ ఫామ్ హౌస్ మరింత ఇరకాటంలో పెట్టింది. 2015 లో లభించిన బ్రేక్ ను తిరిగి ఇవ్వలేకపోయింది. ఫలితంగా కెసిఆర్ కు బాధ మిగిలింది.. భారతీయ జనతా పార్టీకి ఫాయిదా దక్కింది. అంతేకాదు తాను ఏర్పాటు చేసిన సిట్ చేతులు ఎత్తేసింది. కెసిఆర్ ఊహించని సిబిఐ కేసులో ఎంట్రీ అయింది.. మొత్తానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు బిజెపి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ కు దక్కింది హళ్ళికి హళ్ళీ.. సున్నాకు సున్నా…ఎటొచ్చీ సిట్ కు, కోర్టులో లాయర్ల ఫీజులు ప్రభుత్వానికి పైసలు బొక్క.

కేసులో పస లేదు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అసలు పస లేదు. కెసిఆర్ ప్రగతిభవన్లో ప్రెస్ మీట్ పెట్టి చేసిన సెన్సేషన్లో పావు వంతు బలం కూడా ఆ కేసులో లేదు. పైగా బిజెపి పెద్దల్ని బజారుకు లాగాలని కెసిఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు.. ఇప్పుడు ఆయనే సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. వాస్తవానికి ఈ కేసులో బిఎల్ సంతోష్ ను అనుమానితుడిగా విచారించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యా ప్తు బృందం చేయని ప్రయత్నం అంటూ లేదు.. వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. ఇక ఇప్పుడు కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం చేతిలోకి వెళ్లడంతో బిఎల్ సంతోష్ ను విచారిస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కానీ మెజారిటీ అధికారులు మాత్రం ఆయనను విచారించే అవకాశం ఉండదని చెబుతున్నారు..
టచ్ కూడా చేయలేకపోయారు
ఈ కేసులో బీ ఎల్ సంతోష్ ను ఇరికించాలని కెసిఆర్ గట్టిగా అనుకున్నారు.. కనీసం ఆయనను టచ్ కూడా చేయలేకపోయారు.. మరీ ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా సిట్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. ప్రతి చిన్న దానికి కోర్టుకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది.. దీంతో దర్యాప్తు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు.. వాస్తవానికి ఈ కేసులో నిందితులుగా విచారించాలని భావించిన సిట్… మొదట అనుమానితులుగా బిఎల్ సంతోష్, జగ్గూ స్వామి, తుషార్ కు నోటీసులు జారీ చేసింది.. ఈ కేసు సిట్ చేతి నుంచి సిబిఐ చేతికి వెళ్లిన తర్వాత… ఆ ముగ్గురు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.. అయితే వారి పేర్లను ఎఫ్ఐఆర్ఓ లో చేర్చేందుకు సిట్ అధికారులు విఫల ప్రయత్నం చేశారు.. అంతేకాదు ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏసీబీ కోర్టు సిట్ అధికారులకు తలంటింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ను విచారించేందుకు సిట్ అధికారులకు అవకాశం లేకుండా పోయింది ఇక నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీ కోర్టును ఆశ్రయించి ఈ కేసును సిబిఐతో విచారించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు కేసును సిబిఐకి అప్పగించింది.. వాస్తవానికి ఈ కేసులో ఎన్నో చేయాలి అనుకున్న సిట్ ఏమీ చేయలేకపోయింది. అంతటి సీవీ ఆనంద్ ను నియమించినప్పటికీ కెసిఆర్ కు ఫాయిదా దక్కలేదు. కేసులో పసలేనప్పుడు సి వి ఆనంద్ మాత్రం ఏం చేస్తాడు?

కెసిఆర్ కు హెచ్చరికలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తన పేరు చేర్చి ఇబ్బంది పెట్టాలని చూసినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బి ఎల్ సంతోష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు దీని పర్యవసానాలు ముందు ముందు చాలా చూస్తారని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే సిబిఐ ఎంట్రీ అయిన తర్వాత తదుపరి టార్గెట్ కెసిఆర్ అనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ కేసులో నిందితులను పట్టించానని చెబుతున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మెడకే ఇది చుట్టుకుంటున్నది. ఇప్పటికే బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు రోహిత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు..సో మొత్తానికి పొట్టోడిని పొడుగోడు కొడితే… పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టు… ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ ద్వారా కేసీఆర్ బిజెపి నాయకులను కొట్టాలి అనుకున్నారు.. కానీ దురదృష్టవశాత్తు ఆయనే ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.. కేసు సిబిఐ పరిధిలోకి వెళ్లిన నేపథ్యంలో మునుముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.