Kachidi Fish: సహజంగా సముద్రాలలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు.. గంగమ్మ తల్లికి మొక్కుతుంటారు. ఎలాగైనా వాళ్ళనిండుగా చేపలు పడాలని.. తమ కుటుంబాలు చల్లగా ఉండాలని వేడుకుంటారు. మిగతా సందర్భాల్లో ఏమో గాని.. ఈసారి గంగమ్మ తల్లి వారిని కరుణించింది. నిజంగానే ధనలక్ష్మిని తాండవం చేయించింది. ఎందుకంటే ఈసారి కాకినాడ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కచిడి చేప వలలో పడింది. అది దాదాపు 25 కిలోల బరువు ఉంది.. కచిడి చేప శాస్త్రీయ నామం ప్రొటో నిబియా డయా కాన్తస్.. ఈ చేప మామూలుది కాదు. దీనితో ఎన్నో లాభాలు ఉన్నాయి. మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ చేపలో ఎమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు లేమితో బాధపడేవారు దీనిని తింటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదర సంబంధ సమస్యలను ఈ చేప నివారిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా తగ్గుతాయని నివేదికల్లో తేలింది. ఇక ఈ చేప పొట్ట భాగం నుంచి ప్రత్యేకమైన పదార్ధం ద్వారా శస్త్ర చికిత్సల సమయంలో కుట్లు వేసే దారాన్ని తయారుచేస్తారు. అందువల్లే ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీలో ఈ చేపల భాగాలను ఉపయోగిస్తారు. అత్యంత ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను ఉపయోగిస్తారు. అందువల్లే బహిరంగ మార్కెట్లో ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
అరుదు గానే పడతాయి
కచిడి చేపలు అరుదుగానే మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. సహజంగా ఈ చేపలు జూన్ నెలాఖరులో సముద్రానికి ఎదురు ఈదుతాయి. ఆ సమయంలో అప్పుడు ఇవి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. పాండు వలలకు మాత్రమే ఈ చేపలు లభిస్తాయి..ఈ చేపలు మత్స్య కారులకు లభిస్తే మాత్రం పంట పండినట్టే. వ్యాపారులు పోటీపడి మరి ఈ చేపలను కొనుగోలు చేస్తుంటారు.. ఎక్కువగా ఈ చేపలను చైనా, థాయిలాండ్, వియత్నాం, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అక్కడి వ్యాపారులు ఈ చేపలను పోటీపడి మరి కొంటారు. అందువల్లే ఇక్కడి వ్యాపారులు ఈ చేపలు మార్కెట్లోకి రాగానే.. ఎంత ధర అయినా సరే చెల్లించి కొనుగోలు చేస్తారు.. ఆ తర్వాత వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.. అందువల్లే కచిడి చేపలు అంటే మత్స్యకారులు ఎగిరి గంతేస్తారు. వ్యాపారులైతే పండగ చేసుకుంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక చేప కేంద్రంగా లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది.. చేపల పడిన మత్స్యకారులు లక్షాధికారులైతే.. వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు అంతకుమించి ఆనేస్థాయిలో లాభాలు సంపాదిస్తారు.. అందువల్లే కచిడి చేపను నడిచొచ్చే బంగారమని మత్స్యకారులు అభివర్ణిస్తుంటారు.