
NTR 30 Movie: ఎన్టీఆర్ 30 విషయంలో అన్నీ అడ్డంకులే. అనుకున్న సమయం కంటే ఏడాదికి పైగా డిలే అయ్యింది. పలు కారణాలతో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర అసహనంతో ఉన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఎన్టీఆర్ చేసింది ఒక్క సినిమా మాత్రమే. 2018లో అరవింద సమేత వీర రాఘవ విడుదలైంది. 2022 మార్చిలో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ కూడా అనుకున్న సమయం కంటే చాలా లేట్ అయ్యింది. పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడింది.
కనీసం ఎన్టీఆర్ 30 అయినా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ యూనిట్ ఎప్పటికప్పుడు ఆలస్యం చేస్తూ వచ్చింది. పైగా మూవీపై ఎలాంటి అప్డేట్స్ లేవు. వెరసి కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ తమ అసహనం బయటపెట్టారు. ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ వైఖరి పట్ల ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్ళినప్పుడు నాణ్యమైన సినిమాలు తీయాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే ఆలస్యం అవుతుందన్నారు.
కాగా ఫిబ్రవరి 24న ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రాన్ని భారీగా లాంచ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు వేశారు. అన్నపూర్ణ స్టూడియోలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులను పిలిచి ఆర్భాటంగా ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు నిర్వహించాలని యూనిట్ ఆలోచన చేశారు. అనూహ్యంగా వారి ప్రయత్నాలకు తారకరత్న మరణం బ్రేక్ వేసింది. ఎన్టీఆర్ 30 పూజా సెరిమోని వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది.

తారకరత్న అకాల మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హీరో ఎన్టీఆర్ సైతం అన్నయ్య మరణాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం లేదు. మరో మూడు రోజుల్లో జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరిలో లాంచ్ చేసి మార్చి నుండి రెగ్యులర్ షూట్ జరపాలనుకున్నది ప్రణాళిక కాగా ఊహించని విషాదంతో ఎన్టీఆర్ 30 మరలా వెనక్కి పోయింది. దీంతో దర్శకుడు కొరటాల శివ టైం ఏం బాగోలేదంటున్నారు. ఇక ఈ చిత్ర విడుదల తేదీ కూడా ప్రకటించారు. 5 ఏప్రిల్ 2024 న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చెప్పిన టైం కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
