
Viveka Murder Case- Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మంచి దూకుడు మీద ఉన్న సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. విచారణకు హాజరుకాలేనని తేల్చిచెప్పారు. ఇప్పటికే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని రెండు సార్లు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన దగ్గర వాంగ్మూలంతోనే కీలక వ్యక్తుల ప్రమేయాన్ని సీబీఐ గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. అటు విచారణ సైతం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. కేసులో నిందితులు ఐదుగుర్ని ఇప్పటికే సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.అటు నిందితులను బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో వారిద్దరి అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
అయితే సోమవారం హైదరబాద్ లో విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. పులివెందులో ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులిచ్చారు. అయితే తన షెడ్యూల్ ముందే ఖరారైందని.. కార్యకర్తలతో కీలక సమావేశం ఉన్నందున రాలేనని అవినాష్ రెడ్డి రిప్లయ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాజా నోటీసులతో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని అందరూ భావించారు. ఆయన లాయర్లు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే విచారణకు హాజరుకాకూడదని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి సైతం సీబీఐ నోటీసులిచ్చింది. కడపలోని సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో ఆయన్ను విచారించనున్నారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఎలా ముందుకెళుతుందోనన్న చర్చ నడుస్తోంది. ఒక వేళ అవినాష్ రెడ్డి విచారణకు హాజరైన తరువాత అరెస్ట్ చేస్తే అందుకు తగ్గ కారణాలను చెప్పాల్సి వస్తోంది. అదే ఆయన విచారణకు హాజరుకాకపోతే సహకరించడం లేదన్న నెపాన్ని వేసి అరెస్ట్ చేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి సీబీఐకి ఏరికోరి అవకాశమిచ్చినట్టు ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వివేకానందరెడ్డి హత్య కేసులో రానున్న వారంరోజులే కీలకంగా భావిస్తున్నారు. తొలిసారి సీబీఐ విచారణకు పిలిచినప్పుడు అవినాష్ రెడ్డి ఐదు రోజుల తరువాత హాజరయ్యారు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి పూర్తిగా హాజరుకాలేదు. ఇప్పుడు సీబీఐ పట్టుబిగిస్తున్న తరుణంలో వారు తెగ ఆందోళన చెందుతున్నారు. అరెస్టులు తప్పవని భావిస్తుండడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే పొలిటికల్ సర్కిల్ లో, వైసీపీ వర్గాల్లో మాత్రం అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ప్రచారం మాత్రం ఊపందుకుంటోంది.