
Tirumala Darshan Tickets : వేంకటేశ్వర భక్తులకు ఉపశమనం కలిగించేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టిక్కెట్ల కోటా విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా తరువాత ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న దర్శన కోటాను విడతల వారీగా పెంచుకుంటూ పోతున్న బోర్డు, ఈ సారి మరింత పెంచింది. రోజుకు లక్ష మందికి పైగా దర్శనం చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. అలాగే, సిఫార్సు లేఖలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన మీదటే భక్తులకు దర్శనం కలించనున్నట్లు ప్రకటించింది.
మిగిలిన రోజుల కంటే సెలవు రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు సాధారణ భక్తులకు ప్రాధాన్యం కలిగించేందుకు టీటీడీ ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో రూ.300 టిక్కెట్లను ఒక నెలకే విడుదల చేయగా, ఈ సారి రాబోవు రెండు నెలలకు కలిపి ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికార వెబ్ సైట్లో పేర్కొంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో, తిరుమలకు దర్శనానికి అధికంగా వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుందని అంచనా వేసి మే, జూన్ నెలల కోటాను 26వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లేఖలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలర్ట్ అయిన టీటీడీ ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన మీదటే దర్శనానికి అనుమతించనున్నది. బ్రేక్ దర్శనం కోసం ఇబ్బడి ముబ్బడిగా సిఫార్సు లేఖలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్య వీఐపీలు, అధికార నేతలతో కలసి ఒకేసారి 10 నుంచి 20 మంది వరకు వస్తుండటంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సర్వ దర్శనం కోసం వేచి ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాదాపు గంటల కొద్ది క్యూలైన్ లోనే వేచి ఉండుటంతో భక్తులు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ దర్శన టిక్కెట్ల కోటా విషయంలో పలు మార్పులు చేసింది. శనివారం శ్రీవారిని 72,631 మంది దర్శనం చేసుకున్నారు. ఆ సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలుస్తుంది. మే, జూన్ నెలలకు సంబంధించి 25న రూ.300 టిక్కెట్లు విడుదల చేస్తుండగా, అకామడేషన్ టిక్కెట్లను 26న విడుదల చేయనున్నది. ఈ టిక్కెట్లను ఉదయం 10 గంటల నుంచి https://online.tirupatibalaji.ap.gov.in లో గాని, TT devasthanams యాప్ లో గాని బుక్ చేసుకోవచ్చు. ఇక, దాతలకు సంబంధించి రూముల బుకింగ్ ను జూలైకి మార్చింది. వర్చువల్ సేవ టిక్కెట్లను 24వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ వైబ్ సైట్ లో కూడా పలు మార్పులు చేసింది. భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ తెలిపింది.