Trump 2 The Rule: డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యం.. ప్రపంచ పెద్దన్న అమెరికాను ఏలుతున్న అధ్యక్షుడు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. బాధ్యతలు చేపట్టిన నాటినుంచే తిక్క తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. నీలిమందు తాగిన కోతిలా గెంతులేస్తున్నారు. అమెరికన్లను, అమెరికాలోని విదేశీయులను భయపెడుతున్నారు. సుంకాల పేరుతో విదేశీలను తన చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చిన ఆయన చివరకు ఇరాన్‌పై యుద్ధం చేయడం కొసమెరుపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇటీవల కశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై దాడి చేసింది. పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసింది. దీంతో యుద్ధం పెరుగుతుంది. పీవోకే భారత్ వశమవుతుందని అంతా భావించారు. కానీ, సడెన్‌గా యుద్ధం ఆగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన ట్రంప్ భారత్–పాక్ యుద్ధం తానే ఆపించానని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఆపించానని ప్రచారం చేసుకుంటున్నారు.
శరణు కోరిన పాక్..
భారత్–పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని భావించిన పాకిస్తాన్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిని భారత్‌కు పంపించారు. ఆయనతో యుద్ధం ఆపేలా భారత్‌ను ఒప్పించింది. పాకిస్తాన్ సైనికాధికారి ఫోన్ తర్వాత యుద్ధం ఆగిపోయింది. ఇందులో ట్రంప్ పాత్ర ఎక్కడా లేదు. కానీ సీజ్‌ఫైర్ తర్వాత భారత్ అమెరికాకు సమాచారం ఇచ్చింది. కానీ ట్రంప్ ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని తానే యుద్ధం ఆపించానని చెప్పుకున్నారు. చివరకు అది అబద్ధం అని కూడా అంగీకరించాల్సి వచ్చింది.
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కూడా..
ఇక ఇప్పుడు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఆపించానని ప్రచారం చేసుకుంటున్నారు. తన ప్రతిపాదనకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయని తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌తో పోస్తు పెట్టారు. అయితే వాస్తవంగా జరిగింది. అది కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్ అణుస్థావరాలపై బీ2 బాంబర్లతో అమెరికా దాడిచేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఖతార్, సౌదీ అరేబియాతోపాటు నాలుగు దేశాల్లోని అమెరికా స్థావరాలపై కచ్చితమైన దాడి చేసింది. దీంతో వణికిపోయిన అమెరికా సడెన్‌గా సీజ్‌ఫైర్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్‌ను, ఇజ్రాయెల్‌ను కాల్పుల విరమణకు ఒప్పించింది. కానీ, ట్రంప్ ఇప్పుడు తన కారణంగానే యుద్ధం ఆగిందని చెప్పుకుంటున్నారు.
అంతా నోబెల్ కోసమేనా..
ఇటీవల పాకిస్తాన్ సర్వ సైన్యాధికారి ఆసిఫ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. దీంతో అప్పటి నుంచి ట్రంప్‌కు కూడా శాంతి బహుమతిపై కోరిక పుట్టినట్లు ఉంది. దీంతో యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్‌ను నామినేట్ చేసిన వారు, ఆయన లేకపోతే శాంతి బహుమతికే అర్థం లేదన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ అనుచరులు ‘‘ఆయన యుద్ధాలు ఆపాడు, ఒప్పందాలు కుదిర్చాడు’’ అంటున్నారు. కానీ, ఆ ఒప్పందాలు ఎంతవరకు నిలిచాయో చూస్తే, అవి కాగితంపైనే ఎక్కువగా కనిపిస్తాయి. ట్రంప్‌కు బహుమతి ఇస్తే, నోబెల్ కమిటీ హాస్య బహుమతి కోసం కూడా పోటీపడినట్టే!
ట్రంప్ హీరోనా, విలన్‌నా?
అమెరికా రాజకీయాలు ఎప్పుడూ ఒక సర్కస్ లాంటివే. కానీ, ట్రంప్ ఈ సర్కస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన శాంతి బహుమతి కోసం పోటీ పడుతున్నారనే వార్త, అమెరికన్ మీడియాలో కామెడీ షోలకు కొత్త మసాలా ఇచ్చింది. ట్రంప్ అభిమానులకు ఆయన శాంతి దూత, విమర్శకులకు రాజకీయ డ్రామా కింగ్. ఈ రెండు వైపుల మధ్య, నోబెల్ బహుమతి ఒక రాజకీయ ఆటవస్తువుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్‌కు బహుమతి రాకపోతే, ఆయన మళ్లీ ట్వీట్‌లతో ‘‘నోబెల్ కమిటీ ఫేక్’’ అని రచ్చ చేయడం ఖాయం!
నవ్వొస్తుంది, ఆలోచనొస్తుంది!
ట్రంప్‌ను శాంతి దూతగా ఊహించడం కొంచెం కష్టమైనా, ఆయన చేసిన కొన్ని చర్యలు ఇజ్రాయెల్–యూఏఈ మధ్య అబ్రహం ఒప్పందం, కిమ్ జోంగ్–ఉన్‌తో సమావేశాలు నామినేషన్‌కు కారణమైనట్టు కనిపిస్తాయి. కానీ, ఈ ఒప్పందాలు శాంతిని ఎంతవరకు సాధించాయో చర్చనీయాంశం. ట్రంప్ శాంతి కోసం కాక, తన ఇమేజ్ కోసం ఈ ఒప్పందాలు చేశారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అసలు శాంతి బహుమతి అంటే, ట్రంప్ లాంటి రాజకీయ రాక్‌స్టార్‌లకు ట్రోఫీ కాదు, సమాజంలో నిజమైన మార్పు తెచ్చిన వారికి గుర్తింపు.