
Minister Malla Reddy: ” పాలమ్మిన. పూలమ్మిన.. కష్టపడ్డ.. సక్సెస్ అయిన. మల్లారెడ్డి అంటే ఒక మనిషి కాదు. పెద్ద బ్రాండ్” ఇలా ఉంటుంది కార్మిక శాఖ మంత్రి తన గురించి కొట్టుకునే డబ్బా. అది శాసనసభ, పార్టీ సభ.. ఏదైనా సరే ఆయన అలాగే మాట్లాడతాడు. కెసిఆర్ ను అవతార పురుషుడు గాను, కేటీఆర్ ని కాబోయే ముఖ్యమంత్రిగా ను అభివర్ణిస్తాడు. అదే కేంద్ర ప్రభుత్వ విషయానికొస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని కన్నీరు పెడతాడు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే దేశంలో ఆదాయ పన్ను అనేది ఉండదని తలా తోక లేకుండా మాట్లాడుతాడు.. అంతేకాదు తన నియోజకవర్గంలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నా వాటా ఏదని అడుగుతాడు.. అంతేకాదు ఫోన్లోనే దమ్కీ ఇస్తాడు.
మల్లారెడ్డి ఏది చేసినా విశేషమే.. ఎలా చేసినా మీడియాకు వార్తాంశమే. తన కాలేజీలో చిరంజీవి పుట్టినరోజుకు వేలాది మంది విద్యార్థులను సమీకరించి శుభాకాంక్షలు చెప్పగలడు. డీజే టిల్లును తీసుకొచ్చి డ్యాన్స్ వేయగలడు. అంతేకాదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలు చెప్పిన మాట వినరని, సాయంత్రమైతే పార్టీలని తిరుగుతారని చెప్పగలడు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కేసీఆర్ గురించి పొగడ గలడు. ఇలా చెప్పుకుంటూ పోతే మల్లారెడ్డి విన్యాసాలు అటుకులకు అందవు.. పోకలకు పొందవు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో ఓపెన్ టాప్ కారులో డ్యాన్స్ వేస్తాడు. దావత్ లో అనుచరులకు మందు పోస్తాడు.. మోడీపై పళ్ళు కొరుకుతాడు. పెద్ద పెద్ద సినిమా హీరోలు ఇవ్వలేని ఎంటర్టైన్మెంట్ ను క్షణాల్లో ఇస్తాడు.. రేవంత్ రెడ్డి పై తొడకొడతాడు. రా రా సాలే చూసుకుందామంటూ మూతి మీద మీసం లేకపోయినా మెలేస్తాడు. తన అల్లుడిని మహేష్ బాబుతో పోల్చే మల్లారెడ్డి.. తాను యూత్ ఐకాన్ అని చెప్పుకుంటాడు.. అంటే ఎక్కడికి పోయినా కూడా భజన చేస్తాడు అని అర్థం. అందులో ఆరి తేరాడు కాబట్టే వేల కోట్లకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

ఇక ఇటీవల రాష్ట్రంలో గుండెపోటు తాలూకు మరణాలు ఎక్కువైన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గుండెపోటుకు వచ్చినప్పుడు రోగికి చేయాల్సిన సిపిఆర్ పై ట్రైనింగ్ ఇచ్చింది.. దీనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.. కానీ ఎక్కడికి వెళ్లినా మీడియాను అటెన్షన్ చేసే మల్లారెడ్డి.. ఈసారి కూడా తన విచిత్రమైన ప్రవర్తనతో అందరి నోళ్ళల్లో నవ్వులు పూజించాడు. సిపిఆర్ ట్రైనింగుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఒక ఆర్టిఫిషియల్ బొమ్మను అలా గట్టిగా ఒత్తుకుంటూ పోయాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు. మల్లారెడ్డి చేస్తున్న అతిని తట్టుకోలేక మంత్రి కేటీఆర్” ఇక చాలు మల్లన్నాం..ఆపు” అంటూ మల్లారెడ్డిని ఆపాడు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది.