
United States Of Kailasa: రేప్, అహరణ కేసుల్లో నిందితుడు, స్వయం ప్రకటిత దేవుడు అయిన నిత్యానంద స్వామి సొంత దేశం “కైలాస” ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సదస్సుకు హాజరయ్యారన్న వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజంగా ఇది నిజమేనా? దేశం విడిచి పారిపోయి, తనకున్న డబ్బు, పరపతితో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి లాంటి వ్యక్తుల ప్రతినిధులు, భక్తులు ఐక్యరాజ్యసమితిలో ఎలా ప్రవేశం పొందగలిగారు?, అలా ఎవరిని పడితే వారిని మాట్లాడేందుకు ఎలా అవకాశం ఇచ్చారు? రేపటి నాడు మరో నేరగాడు తాను దేశాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించి, తన ప్రతినిధులను ఐక్యరాజ్యసమితికి పంపిస్తే వారికి కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారా? ఒక దేశం గురించి చెప్పినప్పుడు దాని గురించి విచారణ నిర్వహించరా? ఇలాంటప్పుడు ఐక్యరాజ్యసమితికి ఉన్న విలువ మొత్తం బజారున పడదా? ఇప్పుడు ఈ సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిత్యానంద స్వామి అనుచరులు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిందంతా గిమ్మిక్కు మాత్రమే అని తెలుస్తోంది.. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ(సీఈఎస్ఆర్) జెనీవాలో నిర్వహించిన సదస్సుకు కైలాస తరఫున విజయ ప్రియ నిత్యానంద హాజరైన మాట నిజమే, కానీ వారు కైలాస దేశ ప్రతినిధులుగా వెళ్లలేదు.. ఇక ఈ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో 1966లో కుదిరిన ఒప్పందం సరిగా అమలవుతుందా లేదా అని సీఈఎస్ఆర్ పర్యవేక్షిస్తుంది. లో 18 మంది స్వతంత్ర నిపుణులు ఉంటారు. ఈ వేదిక నిర్వహించే సదస్సులకు సివిల్ సొసైటీ గ్రూపులను కూడా అనుమతిస్తుంది.. ఆ మార్గంలోనే కైలాస ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. కైలాస యూనియన్ అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పేరుతో సదస్సుకు హాజరయ్యేందుకు పత్రాలు సమర్పించారు. ఈ సంస్థ కూడా అమెరికాలో రిజిస్టర్ అయి ఉంది. కాలిఫోర్నియాలోని మౌంట్ క్లియర్ లో తమ సంస్థ ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. ఇక ఈ అడ్రస్ ను గూగుల్ స్ట్రీట్ వ్యూ లో వెతికితే వెతికితే అక్కడ నిత్యానంద వేదిక్ టెంపుల్ అనే భవనం కనిపిస్తోంది.

అలా ఆ సంస్థ పేరుతో సరస్సులోకి చెరబడ్డ కైలాస ప్రతినిధులు అక్కడ నిత్యానంద ఫోటోలు పెట్టి, మోకాళ్లపై నిలబడి, ఆ ఫోటోలకు దండాలు పెట్టి, అక్కడ ఉన్న వారందరికీ భగవద్గీత పుస్తకాలు ఇచ్చి (ఆ పుస్తకాల మీద కృష్ణుడి బొమ్మకు బదులు నిత్యానంద బొమ్మ ఉంది) హల్ చల్ సృష్టించారు. భారతదేశం పై అవాకులు, చవాకులు పేలారు. ఈ ఫోటోలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేసి.. రాజ్యసమితి తమ దేశాన్ని గుర్తించిందన్నంత బిల్డప్ ఇచ్చారు. కానీ అదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఇక ఈ సి సి ఎస్ ఆర్ నిర్వహించే సదస్సులకు ఇలాంటి నకిలీ వ్యక్తులు, సంస్థలు హాజరవుతున్నారు అన్న ఆందోళనలు చాలా కాలం నుంచే ఉన్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇక ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం 193 సభ్య, సార్వభౌమ దేశాలు ఉన్నాయి. వాటిల్లో కైలాస లేదు. అసలు ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశం కావడం అంత సులువు కాదు. అందుకు చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, ఇతరతా మండలి ఆమోదం ఉంటే తప్ప సభ్య దేశం హోదా రాదు. అన్నట్టు నిత్యానంద మీద దేశంలో పలు కేసులు ఉన్నాయి. మధ్య అతడు కన్ను మూసినట్టు ప్రచారం కూడా జరిగింది. లైంగిక పరమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో తమ కైలాస దేశానికి ఆయన దేవుడు అని ప్రచారం జరుగుతోంది..