Baldness : కొన్ని డిమాండ్లు నవ్వు తెప్పిస్తాయి. తర్వాత ఆలోచింపచేస్తాయి. ఈ డిమాండ్ కూడా అలాంటిదే. శీర్షిక చదివారు కాబట్టి మీకు విషయం అర్థమైందనే అనుకుంటున్నాం. ఇప్పుడు అసలే రెడీమేడ్ రోజులు.. పీల్చే గాలి తప్ప తినే తిండి, కట్టుకునే బట్ట.. ఇలా ప్రతీ ఒక్కటి రెడీ మేడే. అందుకు తగ్గట్టుగానే వ్యాధులు వస్తున్నాయి.. శరీరంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. పాతికేళ్లకే పొట్ట.. మూడుపదులకే జట్టు రాలి బట్ట వస్తున్నాయి. ఫలితంగా అంకుల్ అనే పదానికి అలవాటు పడాల్సి వస్తోంది.

-ఏకంగా సంఘం పెట్టారు
సమాజంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో… ఏకంగా బట్టతల బాధితులు సంఘం పెట్టారు.. తాము పడుతున్న బాధలను ఏ కరువు పెట్టారు.. కొందరైతే కన్నీరు కూడా పెట్టారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు ₹6000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వింటుంటే ఇది నవ్వు తెప్పించినా.. కాని దాని వెనుక ఎన్ని బాధలు ఉన్నాయో పడ్డవారికి మాత్రమే తెలుస్తుంది.
పెళ్లిళ్ళు కూడా కావడం లేదు
ఒకప్పుడు అంటే రెండు పదుల లోపే పెళ్లిళ్ళు అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విద్య, ఉద్యోగం, కెరీర్ చుట్టూ పరి భ్రమిస్తుండడంతో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగడం లేదు.. ఫలితంగా ఈడు ముదిరిపోతోంది. చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం రాకపోవడంతో ఒత్తిడి పెరిగి ఉన్న జుట్టు రాలిపోతున్నది. అడ్డమైన తిండి తింటే పొట్ట వస్తున్నది.. దీంతో మూడు పదుల వయసుకే అంకుల్ అనే పదానికి అలవాటు పడాల్సి వస్తోంది. కొప్పు ఉంటే ఎలాంటి జుట్టయినా దువ్వుకోవచ్చు. అదే బట్ట తల అయితే.. అబ్బో ఆ నరకం మామూలుగా ఉండదు. పాపం ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు.
ప్రభుత్వానికి ఏం సంబంధం?
బట్టతల బాధితులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ నేపథ్యంలో దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? అనే ప్రశ్న బాధితులను వేస్తే… “ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే మేము చక్కగా కొలువులు సాధించే వాళ్ళం. కానీ ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల మేము ఆలోచించి చించి మా బుర్రను వేడెక్కించుకున్నాం.. ఆ వేడికి బుర్ర మీద ఉన్న వెంట్రుకలు మొత్తం రాలిపోయాయి. నల్లగా నిగనిగలాడాల్సిన మా నెత్తి కాస్త… ఇప్పుడు ఓవల్ మైదానాన్ని తలపిస్తోంది” అని బట్టతల బాధితులు అంటున్నారు. ఇది కూడా వాలిడ్ పాయింటే కదా! మరి ఇది చంద్రశేఖర రావు దృష్టికి వెళ్లిందో లేదో? దీని గురించి ఏం ఆలోచిస్తున్నారో? ఈ ఏడాది ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏమైనా హామీ ఇస్తారేమో మరి?!