spot_img
Homeట్రెండింగ్ న్యూస్Natural Disaster In Telangana: వర్షకాలంలో ఎండిపోతున్న చెట్లు.. తెలంగాణలో ప్రకృతి వైపరీత్యం

Natural Disaster In Telangana: వర్షకాలంలో ఎండిపోతున్న చెట్లు.. తెలంగాణలో ప్రకృతి వైపరీత్యం

Natural disaster in Telangana: శ్రావణమాసంలో నిండు పచ్చదనంతో కనిపించే టేకు చెట్లు నిర్జీవంగా మారుతున్నాయి. తెలుపు, ఎరుపు రంగులోకి మారిన ఆకులను దూరం నుంచి చూస్తే మంటల్లో కాలిపోతున్న మాదిరి కనిపిస్తున్నాయి. పత్రహరితం పూర్తిగా కోల్పోయి ఆకులు అస్థిపంజరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల అటవీ ప్రాంతంలో ఇలాంటి దృశ్యాలు పక్షం రోజులుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా..
ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే మొక్కల్లో టేకు ఒకటి. ఒడిశా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ 2018లో ప్రచురించిన ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ కరెంట్‌ మైక్రోబయాలజీ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌’ పరిశోధనా పత్రం ప్రకారం.. భూగోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్లలో టేకు 5 స్థానాల్లో ఉంది. భారత దేశంలో 9 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో టెకు వనాలు అధికంగా ఉన్నాయి.

తెగులు ప్రభావంతో..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని అడవుల్లో టెకు వనాలు క్కువగా ఉన్నాయి. వీటిని ‘యూటెక్టోనా మాచెరాలిస్‌’ తెగులు ఆశించింది. ఏటా ఈ తెగులు టేకు వనాలను ఆశిస్తుంది. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందింది. గతంలో ఇంత పెద్ద విస్తీర్ణంలో ప్రభావం లేదు. వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో ఉంది.

అసలేంటి ఈ వ్యాధి?
టేకు చెట్లలో కనిపిస్తున్న ఈ లక్షణాలను ‘టీక్‌ స్కెలిటనైజర్‌’గా పిలుస్తారని అటవీ, వృక్షశాస్త్ర నిపుణులు వెల్లడించారు. వెడల్పాటి ఆకుల్లో పత్రహరితం పూర్తిగా కోల్పోయి ఈనెలు మాత్రమే మిగిలి, చూడటానికి అస్థిపంజరంలా తలపిస్తుందని, అందుకే ఆ పేరుతో పిలుస్తారని నిపుణులు వివరించారు. ‘టీక్‌ స్కెలిటనైజర్‌’ ఒక ఎపిడమిక్‌ వ్యాధి(చీడ). ఇది టేకు చెట్లకు వచ్చే ఒక రకమైన చీడ పీడ వంటిది. నిర్ధిష్ట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో టేకు చెట్లను ఇది ప్రభావితం చేస్తుంది. సాధారణ చీడలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో చెట్లు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కీటకం సీతాకోక చిలుకలా ఎదిగి..
ఈ మధ్య కాలంలో టేకు చెట్లపై ఎక్కువగా కనిపిస్తున్న ఎరుపు, గోధుమ రంగుల మచ్చలకు కారణం ‘యూటెక్టోనా మాచిరాలిస్‌’ అని పిలిచే ఒక రకమైన ‘మాత్‌’ (సీతాకోక చిలుక జాతి) కీటకం. టేకు చెట్ల ఆకులమీద ఇది గుడ్ల దశ నుంచి కీటకంగా మారుతుంది. అంటే గొంగళి పురుగు దశలో ఆకుల్లోని పత్రహరితాన్ని ఆహారంగా తీసుకుని కీటకంగా మారి ఎగిరిపోతుంది.

రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో సంతతి..
ఇది స్కెలిటనైజర్‌ అనే ఒక ఎపిడమిక్‌ డిసీజ్‌. ఈ కీటకాలు రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో వాటి సంతతిని ఉత్పత్తి చేస్తాయి. టేకు చెట్ల ఆకుల్లో ఉండే క్లోరోఫిల్‌(పత్రహరితం) మొత్తాన్ని ఇవి తినేస్తాయి. టేకు చెట్లు ఈ కీటకాలకు (‘యూటెక్టోనా మాచిరాలిస్‌’) హోస్ట్‌గా పనిచేస్తాయి. విశాలంగా ఉండే ఈ చెట్ల ఆకులపై అవి గుడ్లు పెడతాయి. వర్షాకాలం సీజన్‌లో ఎక్కువగా టేకు చెట్లకు ఈ చీడ సోకే అవకాశం ఉంది. వేసవిలో టేకు చెట్టు ఆకులను రాలుస్తుంది కాబట్టి వీటికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో ‘వావిలి’ లాంటి ఇతర చెట్లను ఇవి ఆశ్రయిస్తాయి.

అరికట్టాలంటే..
దీనిని అరికట్టాలంటే చాలా పెద్ద యంత్రాంగం అవసరం. పెద్ద మొత్తంలో హెలికాప్టర్‌ల ద్వారా స్ప్రే చేస్తే కంట్రోల్‌ చేసే అవకాశం ఉంది. కానీ అంత పెద్ద యంత్రాంగం లేదు. అయితే, ఈ చీడతో కలిగే నష్టం తక్కువే. వరుసగా వర్షాలు కురిసినా, బలమైన గాలులు వీచినా ఈ కీటకాలు చనిపోతాయి. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే వచ్చింది. దానంతట అదే కంట్రోల్‌ అయింది. ఇది అప్పుడప్పుడూ రావడం, సహజసిద్దంగా దానికదే పోవడం జరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES
spot_img

Most Popular