Homeజాతీయ వార్తలుCM KCR: ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన కేసిఆర్

CM KCR: ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన కేసిఆర్

CM KCR: తెలంగాణ శాసనసభకు త్వరలో నిర్వహించే ఎన్నికలకు గానూ అధికార భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఏడు స్థానాలు మినహా మిగతా అన్నింటిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నందువల్లే వారికి అవకాశం ఇచ్చినట్టు ప్రకటించారు. కానీ ఇవన్నీ చెప్పిన భారత రాష్ట్ర సమితి అధినేత.. నమ్ముకుని వచ్చిన వారికి మాత్రం అన్యాయం చేశారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు, పార్టీ అవసరాలు, బలోపేతం కోసం, ఉప ఎన్నికల సమయంలో.. ఇలా పలు సందర్భాల్లో ఇతర పార్టీల నేతలను భారత రాష్ట్ర సమితిలోకి రప్పించుకొని, భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి మొండి చేయి చూపారు. చేర్చుకున్న నేతలతో పాటు మొదటినుంచి భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతున్న వారికి కూడా టికెట్ నిరాకరించారు.

పాపం వారి పరిస్థితి

ఇక కెసిఆర్ ఆశపెట్టిన వారి జాబితాలో మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు తమ దారి ఏమిటో తెలియక వారు కొట్టుమిట్టాడుతున్నారు. నమ్మి వస్తే ఇలా చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ తీరు మాత్రం ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ నేతలకు సంబంధించిన కార్యకర్తలు మాత్రం పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో స్నానం దక్కని వారికి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, హడావిడి నిర్ణయాలతో భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని కెసిఆర్ సూచించినప్పటికీ.. అప్పుడు పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశమిస్తామంటూ అధికార పార్టీ ఆయా నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఫలించడం లేదు. ఇందుకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య తో చర్చించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆయన కలవకుండా.. తర్వాత కలుస్తానని చెప్పడమే ఇందుకు నిదర్శనం.

ప్రత్యామ్నాయ వేదికల వైపు..

అంతృప్తిగా ఉన్న నేతలు పలువురు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అసంతృప్తిలో ఉన్న నేతలందరికీ ప్రభుత్వం ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా? అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను ఘాటుగానే వ్యక్తికరిస్తున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇలాగే తన వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయడం.. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం.. ఆయన చర్యలతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన పెద్దలు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీంతో ధిక్కరించిన వారికే పార్టీ పట్టం కట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014, అదే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వరుసగా రెండుసార్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను గెలుచుకున్నప్పటికీ, ఇతర పార్టీల తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న విషయం విధితమే. ఈ క్రమంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచిన వారితో పాటు ఓడిన వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు వారికి టికెట్ తో పాటు ఇతర పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఆ హామీలు మొత్తం విస్మరించారు. సీనియర్లు, మాజీమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం రానున్న ఎన్నికలకు టికెట్ కేటాయించలేదు. ఈ జాబితాలో ఖమ్మం జిల్లా చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఈనుగాల పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, సొంత పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, పార్టీని నమ్ముకుని వచ్చిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, 2014లో భారత రాష్ట్ర సమితి తరఫున ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్, మధిర నుంచి పోటీ చేసిన బొమ్మెర రాంమ్మూర్తి ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ గనుక వీరు ప్రత్యామ్నాయ వేదికల వైపు వెళ్తే మాత్రం అధికార పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular