Tragedy: పెళ్లయిన ఐదు రోజులకే.. గోదావరిలో దూకిన నవజంట.. అసలు కారణం ఏంటి?

వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతికి ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన శివరామకృష్ణ తో ఈనెల 15న వివాహం జరిగింది. వీరు మంగళవారం రావులపాలెంలో సినిమాకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు.

Written By: Dharma, Updated On : December 21, 2023 6:27 pm

Tragedy

Follow us on

Tragedy: వారికి వివాహం జరిగి ఐదు రోజులే అవుతోంది. ఇంకా తిరుగుమరుగులు కూడా కాలేదు. సినిమాకు వెళ్తామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన వారు గోదావరి నదిలో దూకారు. అక్కడున్నవారు నవ వరుణ్ణి కాపాడగా.. నవవధువు మాత్రం మృతి చెందింది. అసలు ఏం జరిగింది? అన్నది మిస్టరీగా మారింది. కానీ మృతురాలి బంధువులు మాత్రం భర్త ఏదో చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతికి ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన శివరామకృష్ణ తో ఈనెల 15న వివాహం జరిగింది. వీరు మంగళవారం రావులపాలెంలో సినిమాకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే బ్రిడ్జి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న కేదారి ఘాట్ వద్ద రక్షించమంటూ శివరామకృష్ణ అరిచాడు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను కాపాడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వధువు గల్లంతు కావడంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం వెలుగు చూసింది. సత్యవతికి తండ్రి లేకపోవడంతో అన్ని తానై తాత పెంచాడు. ఇంతలోనే ఈ విషాదం అలుముకొంది.

అయితే వధువు సత్యవతి బంధువులు మాత్రం శివరామకృష్ణ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. వడలి గ్రామస్తులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. సత్యవతిని హత్య చేసి గోదావరిలో పడేశాడని చెబుతున్నారు. దీంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివరామకృష్ణ అదుపులోకి తీసుకొని వివరాలను రాబెడుతున్నారు.